వైసీపీ నేత ‘కేబుల్‌’ వార్‌

ABN , First Publish Date - 2023-03-26T04:23:14+05:30 IST

గుంటూరు నగరంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత కేబుల్‌ వార్‌కు తెగబడ్డారు.

వైసీపీ నేత ‘కేబుల్‌’ వార్‌

గుంటూరు సిటీలో కేబుల్‌, నెట్‌ వైర్లు కత్తిరింపు

సదరు నేత సొంత కేబుల్‌కు పోటీగా ఉన్నాయనే..!

రూల్స్‌ మేరకే తొలగించామన్న అధికారులు

మండిపడుతున్న కేబుల్‌ ఆపరేటర్లు

నెట్‌, కేబుల్‌ ప్రసారాలకు అంతరాయం

గుంటూరు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత కేబుల్‌ వార్‌కు తెగబడ్డారు. ఆయనకు సొంతంగా కేబుల్‌ ఉంది. దానికి పోటీగా ఉన్నాయంటూ సిటీ కేబుల్‌, ఇతర కేబుల్‌ ఆపరేటర్లపై తన ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్‌ పోల్స్‌కు ఉన్న కేబుల్‌, నెట్‌ వైర్లను శనివారం ఉదయం నుంచే ఎక్కడికక్కడ కోసి కుప్పలుగా వేయడం కనిపించింది. విద్యుత్‌ లైన్‌ మెన్‌లతో పాటు ఆ నేత అనుచరులు కూడా కేబుల్‌ వైర్ల కత్తిరింపు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. అయితే నిబంధనల మేరకే వ్యవహరించామని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోల్స్‌కు తగిలించిన వేరుకట్టలను తొలగించామని వివరణ ఇచ్చారు. అధికారుల తీరుపై కేబుల్‌ ఆపరేటర్లు మండిపడుతున్నారు. మొన్నటివరకు నిబంధనలు ఏమయ్యాయని, హఠాత్తుగా కేబుల్‌ వైర్లు కట్‌ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, పలు ప్రాంతాల్లో కేబుల్‌తోపాటుగా నెట్‌ వైర్లు కట్‌ చేయటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటర్‌నెట్‌కు అంతరాయం కలగటంతో విద్యార్థులు ఎంసెట్‌ పరీక్షలకు సంబంధించిన చెల్లింపులకు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. గుంటూరు నగరంలోన పలు నెట్‌ కేంద్రాల వద్ద విద్యార్థులు రాత్రి వరకు పడిగాపులు కాశారు.

సీఎండీ ఆదేశాల మేరకే....

‘‘గుంటూరు నగరంలో పోల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కేబుల్‌, నెట్‌ వైర్ల కట్టలను ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మజనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు తొలగించాం. కేవలం పోల్స్‌కు కేబుల్‌ వైర్లు ఏర్పాటు చేసుకోవాటానికే పన్ను చెల్లిస్తున్నారు. కానీ, కట్టలుకట్టలుగా ఏర్పాటు చేయటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దఫాలుగా పత్రికా ప్రకటనలతో హెచ్చరికలు కూడా చేశాం. ఇటీవల నగర పర్యటనకు వచ్చిన సీఎండీ కూడా కేబుల్‌ వైర్లపై సీరియస్‌ అయ్యారు’’

-గుంటూరు సర్కిల్‌ ఆపరేషన్‌

ఎస్‌ఈ మురళీకృష్ణయాదవ్‌

Updated Date - 2023-03-26T04:23:14+05:30 IST