ఫైనల్‌’గా ఇదేనా!?

ABN , First Publish Date - 2023-03-19T03:16:44+05:30 IST

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదనడం నిజం కాదు.

ఫైనల్‌’గా ఇదేనా!?

సెమీ ఫైనల్స్‌ అని తేల్చిన వైవీ

‘విశాఖ రాజధాని’తో ఎమ్మెల్సీకి లింకు

ఓటమి దెబ్బతో వైసీపీ మౌన రోదన

అతి ధీమాతో దెబ్బతిన్న ‘సింగిల్‌’ సింహం

పట్టభద్రులు పథకాల లబ్ధిదారులు కారని వింత వాదన

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదనడం నిజం కాదు. వామపక్షాలకు చెందిన పీడీఎఫ్‌ కూటమి అభ్యర్థులూ బరిలో నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గణనీయంగా చీలినా వైసీపీకి గెలుపు దక్కలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘కేవలం 9 లక్షల మంది వేసిన ఓట్లు ఎలా ప్రాతిపదిక అవుతాయి? ఈ ఫలితాలను మేం హెచ్చరికలా భావించడంలేదు. ఏ రకంగానూ ఈ ఫలితం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాదు.’’

- 3 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓటమి అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ప్రకటన ఇది!

ఇప్పుడు కొన్నాళ్లు వెనక్కి వెళదాం! వైసీపీ అగ్రనేత, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అప్పుడు ఏమన్నారంటే...

‘‘ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్నవి! కాబట్టి వీటిని సెమీఫైనల్‌గా తీసుకోవాలి. దానికోసమే మేం ఇంత శ్రద్ధపెట్టి పదేపదే విజ్ఞప్తిచేస్తున్నాం! ముఖ్యమంత్రి విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పారు. దానిని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, రాష్ట్రమంతా తెలిసేలా గొప్ప మెజారిటీ వచ్చేలా గెలిపించాలి!’’

అదీ సంగతి! ‘ఇవి సెమీ ఫైనల్స్‌’ అని వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడో తేల్చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా... విశాఖ వేదికగా జరిపిన సమావేశంలో ఈ మాటలు అన్నారు. ఇప్పుడివి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సీఎం జగన్‌ ఎంపీ విజయసాయి రెడ్డిని పక్కనపెట్టి మరీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందునుంచే ఆయన ‘ఇవి సెమీఫైనల్స్‌’ అనే చెబుతూ వచ్చారు. ‘‘వీటి ఆధారంగానే ఫైనల్‌ ఉంటుం ది’’ అని తెలిపారు. ఎన్నికల్లో గెలిపించడం ద్వారా విశాఖ రాజధాని నిర్ణయాన్ని ఇక్కడి పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు గొప్పగా స్వాగతించారన్న సంకేతాలు ఇవ్వాలని పదేపదే చెప్పారు. చివరకు ఆశించిన ఫలితం దక్కలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి సుధాకర్‌ ఓడిపోయా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సకల యంత్రాంగం అంతా మకాం వేసి మంత్రాంగం చేసినా, టీడీపీ అభ్యర్ధి చిరంజీవిరావు గెలుపును అడ్డుకోలేకపోయారు.

కచ్చితంగా గెలిచితీరుతామన్న ధీమాతోనే సుబ్బారెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ‘సెమీ ఫైనల్స్‌’గా నిర్ధారించారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇప్పుడు ఆయన భాషలో చెప్పాలంటే... ‘ఈ ఫలితం ఫైనల్స్‌లోనూ రిపీట్‌ అవుతుంది. విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతించడంలేదు!’ కాగా, ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఫలితాన్ని ‘పరిపాలనా రాజధాని’తో ముడిపెట్టడం ఆప్రాంత వైసీపీ నేతల తలకు చుట్టుకుంది. తాజా ఫలితంపై ఏమీ మాట్లాడలేక మౌనముద్ర దాల్చారు. ఏ కీలక నేతను కదిలించినా.. ‘మమ్ముల్ని వదిలేయండి ప్లీజ్‌’ అంటున్నారు. ‘‘సెమీఫైనల్‌ అని వైవీ చెప్పారు. వైసీపీ ఓడిపోయింది. ఫైనల్‌లోనూ ఇదే పునరావృతమవుతుంది’’ అని విశాఖకు చెందిన వెంట్రామిరెడ్డి అనే సామాజిక కార్యకర్త చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. సుబ్బారెడ్డి మాట్లాడిన రెండు వీడియోలను ట్వీట్‌చేయగా, వాటిని ఇప్పటి వరకు 13,600 మంది రీ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-03-19T03:16:44+05:30 IST