జనం చేతికి జిరాక్స్!
ABN , First Publish Date - 2023-08-31T03:20:13+05:30 IST
ప్రజల ఆస్తులను తన గుప్పిట్లోనే ఉంచుకొనే భారీ కుట్రకు జగన్ సర్కారు తెర తీసింది. రాష్ట్రంలో ఆస్తి ఏదైనా, ఎవరిదైనా ఇకనుంచి రిజిస్ర్టేషన్ అంటూ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే కంప్యూటర్లలో ఉంటాయి. ప్రజలకు జిరాక్స్ కాపీ
ఒరిజినల్ ఆస్తి పత్రాలు సర్కారు గుప్పిట్లో..
ప్రజల ఆస్తులతో కంప్యూటర్ గేమ్స్
ఆస్తుల రక్షణపై జనంలో భయాందోళనలు
డిజిటల్ ప్రక్రియలో ఎంతెంతో సంక్లిష్టత
సీఎంవోలోనే డిజిటల్ దొంగలు.. ఫైళ్లు క్లియర్
రిజిస్ర్టేషన్లలో మోసాలకు విపరీతంగా చాన్స్
ఒరిజినల్స్ జారీలో జాప్యం వల్లే జిరాక్స్‌లట
సర్కారు వింత వాదన.. ద్రాక్షారామం,
విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
15 నుంచి రాష్ట్రమంతా అమలుకు సిద్ధం
ఉద్యోగులు గానీ, వ్యాపారస్తులు గానీ, కూలి పనులు చేసేవాళ్లు గానీ, రైతులు గానీ జీవితమంతా కష్టపడి ఒక స్థలమో, ఇల్లో కొనుక్కుంటారు. అది వారి కల. రిజిస్ర్టేషన్ పూర్తి చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చుకుని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకుంటారు. ఇక నుంచి అవేవీ ఉండవు. ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం తన దగ్గర ఉంచేసుకుని జిరాక్స్‌లు మాత్రమే చేతికి ఇస్తుంది. ఒకవేళ సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే ఫీజు కట్టి... అది చేతికి వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే!
అత్యంత కట్టుదిట్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉండే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సీఎం, సీఎంవో అధికారుల డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసి వందల ఫైళ్లకు క్లియరెన్సు ఇచ్చేశారు. అలాంటిది రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో ప్రజల ఒరిజినల్ పత్రాలు ఉండడం ఎంత వరకు సేఫ్? అలాంటి అవకతవకలు రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో జరిగితే ప్రజలంతా రోడ్లపై నిలబడాల్సిందే!
అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆస్తులను తన గుప్పిట్లోనే ఉంచుకొనే భారీ కుట్రకు జగన్ సర్కారు తెర తీసింది. రాష్ట్రంలో ఆస్తి ఏదైనా, ఎవరిదైనా ఇకనుంచి రిజిస్ర్టేషన్ అంటూ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే కంప్యూటర్లలో ఉంటాయి. ప్రజలకు జిరాక్స్ కాపీ మాత్రమే చేతికి ఇస్తారు. రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తై ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యం జరుగుతోందని, ఈ జాప్యాన్ని నివారించేందుకే ఈ విధానం చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఒరిజినల్ పత్రాల స్థానంలోకి జిరాక్స్ పత్రాలు చేరితే ఆర్థిక మోసాలకు ద్వారాలు తెరిచినట్టేనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే ఆస్తిని ఎన్నిసార్లైనా అమ్ముకునేందుకు సర్కారే తలుపులు తెరిచినట్టు అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వద్ద ఒరిజినల్ ఆస్తి పత్రాలు సురక్షితంగా ఉంటాయో లేదోనన్న భయం ప్రజలను అనుక్షణం వెంటాడే అవకాశం ఉంటుంది. పైగా, ప్రజలను చైతన్యపరచకుండా ఎకాఎకిన మాన్యువల్ నుంచి ఆన్‌లైన్‌లోకి మారమంటే ఎలాగని డిజిటల్ విధానాలను సమర్థించేవారు సైతం వాదిస్తున్నారు. అయితే, సర్కారు మాత్రం ద్రాక్షారామంలో వారం రోజుల నుంచి, విజయవాడలో బుధవారం నుంచి పైలట్‌గా అమల్లోకి తెచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్ అనే విధానం తీసుకొచ్చి అన్ని రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనూ ప్రవేశపెడుతున్నారు.
ఇప్పుడిలా...: ఫిజికల్ డాక్యుమెంట్‌లో ఏవైనా తప్పులు దొర్లితే ఒక్క అక్షరమైనా దాన్ని సరిదిద్దాలంటే మళ్లీ రెండు పార్టీల సంతకాలు తీసుకునే చేస్తారు. దస్తావేజు సిద్ధమయ్యాక ఒకటికి రెండుసార్లు సబ్‌రిజిస్ర్టార్లు, కిందిస్థాయి అధికారులు సరిచూసి సంతకాలు చేస్తారు. తాజా విధానం ప్రకారం... ఫిజికల్ డాక్యుమెంట్ చేతిలో లేకపోతే వాటిని సరిచూడడం సాధ్యమయ్యే పనికాదని సబ్‌రిజిస్ర్టార్లే చెప్తున్నారు. ఒకవేళ ఇ-డాక్యుమెంటులో తప్పులు దొర్లితే ఎవరు చూడాలి, వాటిని మార్చాలంటే ఎలా మార్చాలి?...ఇలా అన్నీ ప్రశ్నలే. కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు పాటించాల్సిన పద్ధతులను జగన్ సర్కారు వదిలేసింది. వాస్తవానికి దీనిపై ప్రజల్లో చర్చ పెట్టాలి. ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. అలాకాకుండా, నాలుగ్గోడల మధ్య నలుగురు అధికారులను పిలిచి వారు చెప్పే అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల్లో అవతవకలు ఆపగలరా?
గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్లంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. గ్రామాల్లో ఒక మోస్తరు చదువుకున్నవారికైనా రిజిస్ర్టేషన్ పరిజ్ఞానం శూన్యం. సీనియర్ సబ్‌రిజిస్ర్టార్లే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలాచోట్ల చేతులెత్తేస్తున్నారు. అలాంటిది గ్రామాల్లో రిజిస్ర్టేషన్లు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీలపై ప్రలోభాలు, ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్ ఇవ్వకుండా జిరాక్స్ చేతిలో పెట్టి, అందులో ఉన్నదే వాస్తవమంటే ఎలా నమ్మగలం? మరోవైపు.. జిరాక్సు కాపీని ఎన్ని బ్యాంకుల్లోనైనా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అదే ఒరిజినల్ కాపీ ఆస్తిదారుడి వద్ద ఉంటే ఈ తరహా మోసాలకు ఆస్కారం ఉండదని అంటున్నాయి. జిరాక్సు కాపీ చూపించి 10 మంది అగ్రిమెంట్లు చేసి, అడ్వాన్సులు తీసుకుని 11వ వ్యక్తికి రిజిస్ర్టేషన్ చేస్తే ఆ 10 మంది రోడ్డున పడాలా?
కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్ అంటే..
ఇదొక పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం. ప్రజలే నేరుగా తమ వివరాలు, కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి వివరాలు, రెండు పార్టీల వివరాలు పొందుపర్చి రిజిస్ర్టేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మార్కెట్ విలువ, స్టాంపు డ్యూటీ, చార్జీలు ఎంత చెల్లించాలనేది కంప్యూటర్‌లో జనరేట్ అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి, రిజిస్ర్టేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత రెండు పార్టీలు ఆధార్‌తో అనుసంధానించబడిన ఇ-సంతకాలు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఇలా చేస్తే ఫిజికల్ డాక్యుమెంటు తేవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు వేస్తే ఆ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న పత్రాలు కంప్యూటర్‌లో కనిపిస్తాయి. సబ్‌రిజిస్ర్టార్ కూడా ఈ-సంతకం చేస్తే రిజిస్ర్టేషన్ పూర్తయిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంటు ప్రభుత్వ కంప్యూటర్‌లో ఉండిపోతుంది. దాన్ని జిరాక్స్ తీసి ఆ వ్యక్తికి ఇస్తారు. ఈ మాడ్యూల్ తయారీకి రూ.35 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతిఏడాది దీనికి నిర్వహణ చార్జీలు అదనం.
ఇదేం వాదన!
కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్‌తో సమయం ఆదా అవుతుందని, వివరాలన్నీ ముందుగానే సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయానికి చేరుతాయి కాబట్టి, రిజిస్ర్టేషన్ సమయంలో జాప్యం తగ్గుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ పనులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఎంతమంది చేసుకోగలరనేది ప్రశ్నార్థకం! ఏ కంప్యూటర్ సెంటర్‌కో వెళ్లి, మన ఆస్తుల వివరాలన్నీ చెప్పి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో రెండు పార్టీలవి, సబ్‌రిజిస్ర్టార్లవీ ఫిజికల్ సంతకాలు ఎక్కడా ఉండవు. ఫిజికల్ డాక్యుమెంట్లు ఎక్కడా ఉండవు. దేశంలో ఈ విధానం మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. అక్కడా పైలట్ దశలోనే ఉంది. రాష్ట్రంలో మాత్రం సెప్టెంబరు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించేశారు.
ఆటోమ్యుటేషన్ ఎందుకు ఆపారు?
ఆటోమ్యుటేషన్ ప్రక్రియను కొన్నిరోజులు అమలు చేశారు. భూముల రిజిస్ర్టేషన్ జరగ్గానే, ఆ సమాచారం ఆటోమేటిగ్గా ఆ పరిధిలోని తహసీల్దారు కార్యాలయానికి వెళ్తుంది. నిర్దిష్ట కాలపరిమితిలోగా తహసీల్దారు ఆ భూమిని మ్యుటేషన్ చేసేవారు. ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రక్రియను మూలనపడేశారు.
నాడు రాష్ట్ర ఆస్తులు.. నేడు ప్రజల ఆస్తులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో రాష్ట్రంలో ప్రభుత్వ భూములు వేలం ద్వారా అమ్మేందుకు ప్లాన్ వేసింది. హైకోర్టు ఆ నిర్ణయాన్ని అడ్డుకుంది. తర్వాత ఆ భూములన్నింటినీ బ్యాంకుల్లో తనఖా పెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఇప్పుడు ప్రజల ఆస్తుల వంతు వచ్చిందన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.