టీచర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు?

ABN , First Publish Date - 2023-09-18T02:13:58+05:30 IST

ఉపాధ్యాయులపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు రాజీలేకుండా పనిచేస్తున్న టీచర్ల పట్ల మంత్రి తన స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాయి.

టీచర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు?

ధర్మాన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

సర్కారు తీరుతో 5లక్షల డ్రాపౌట్స్‌ అని ఆక్షేపణ

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు రాజీలేకుండా పనిచేస్తున్న టీచర్ల పట్ల మంత్రి తన స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు స్పందిస్తూ... విద్యా రంగంలో ఎన్ని హంగులు తెచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుందో చెప్పగలరా? అని మంత్రిని ప్రశ్నించారు. పాఠాలు చెప్పనీయకుండా బోధనేరత పనులు ఎందుకు అప్పగిస్తున్నారో చెప్పాలన్నారు. బదిలీలు చేసి నాలుగు నెలలైనా ప్రభుత్వం ఇంతవరకు టీచర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయిందో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దొడ్డిదారిన వందల మంది టీచర్లను ఎందుకోసం బదిలీ చేస్తున్నారో కూడా ధర్మాన చెప్పాలన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజాధనం పంపకం!

ఉపాధ్యాయ సంఘాలు ప్రమాదకరం ఎలా అవుతాయో మంత్రి ధర్మాన సమాధానం చెప్పాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలుపై స్వయంగా సీఎం ఇచ్చిన హామీ ఏమైందో మంత్రి తెలపాలన్నారు. ఈ ప్రభుత్వం జీవో 117 జారీచేసి పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిందని, 5లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్లేందుకు కారణమైందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజాధనాన్ని పంచిపెట్టడం తప్ప ఇంకేం జరగలేదని విమర్శించారు. మంత్రి వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, ఉపాధ్యాయులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వ్యాపారాలు చేస్తే చర్యలేవీ?

ఉపాధ్యాయులు వ్యాపారాలు చేస్తున్నారని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించడాన్ని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ మంజుల, కె.భానుమూర్తి ఖండించారు. అలా వ్యాపారాలు చేస్తుంటే ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒకవేళ అలా వ్యాపారాలు చేస్తే వాటి వెనుక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలే ఉంటారని, అందుకే వారిపై చర్యలు తీసుకోవడం లేదేమోనని అన్నారు. అలాంటి కొందరిని ఉద్దేశించి మొత్తం టీచర్లంతా వ్యాపారాలు చేస్తున్నారనడం సరికాదన్నారు. యాప్‌లో హాజరుపై టీచర్లు అభ్యంతరం తెలపలేదని, హాజరుకు ఉపకరణాలు ఇవ్వాలని కోరితే ప్రభుత్వమే పట్టించుకోలేదని తెలిపారు.

బాబు అరెస్ట్‌తో జగన్‌ పతనం: నసీర్‌

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు జగన్‌రెడ్డి పతనానికి నాంది అవుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ హెచ్చరించారు. చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి, జైలు పాలు చేయడం ముఖ్యమంత్రి సైకోయిజానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2023-09-18T02:13:58+05:30 IST