‘బీఈడీ స్పాట్’ విద్యార్థులకు పెనాల్టీలెందుకు?
ABN , First Publish Date - 2023-06-20T04:14:15+05:30 IST
నిర్దిష్ట గడువులోగా బీఈడీ స్పాట్ అడ్మిషన్ ప్రవేశాల ర్యాటిఫికేషన్ చేయించకుంటే ప్రతి విద్యార్థి రూ.2వేలు చెల్లించాలన్న ఉన్నత విద్యామండలి ఆదేశాలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రండి.. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి!
ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): నిర్దిష్ట గడువులోగా బీఈడీ స్పాట్ అడ్మిషన్ ప్రవేశాల ర్యాటిఫికేషన్ చేయించకుంటే ప్రతి విద్యార్థి రూ.2వేలు చెల్లించాలన్న ఉన్నత విద్యామండలి ఆదేశాలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంత భారీ మొత్తం పెనాల్టీ విధించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని ఆదేశించింది. విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఆదేశాలిచ్చారు. 2022-23 బీఈడీ స్పాట్ అడ్మిషన్ ప్రవేశాల ర్యాటిఫికేషన్ కోసం తమ కాలేజీకి చెందిన 97మంది విద్యార్థుల పెనాల్టీ సొమ్ము, ఇతర ఖర్చులు కింద రూ.2.97 లక్షలు చెల్లించేందుకు అధికారులు వెబ్‌సైట్ ద్వారా అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన ఓ కాలేజీ కరస్పాండెంట్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.