Share News

250 types of bottles : ఆ ‘కిక్కు’ ఎవరి ఖాతాలోకి?

ABN , First Publish Date - 2023-11-21T03:13:48+05:30 IST

‘పన్నుల సవరణ’ పేరిట కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు భారీగా తగ్గడం వెనుక అసలు ‘కిక్కు’ వేరే ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

250 types of bottles : ఆ ‘కిక్కు’ ఎవరి ఖాతాలోకి?

పన్నుల సవరణ వెనుక భారీ మాయ

250 రకాల బాటిళ్ల ధరలు తగ్గింపు

ఆ బ్రాండ్లకు కలిసొచ్చిన పన్నుల సవరణ

ఒక్క సీసాపైనే రూ.330 తగ్గుదల

కొన్నిటిపై రూ.320, రూ.180, రూ.90

వాటి అమ్మకాలు భారీగా పెరిగే చాన్స్‌

ఆ కంపెనీలకు యమా కిక్కు

ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘పన్నుల సవరణ’ పేరిట కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు భారీగా తగ్గడం వెనుక అసలు ‘కిక్కు’ వేరే ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే... ఇకపైనా ప్రభుత్వం సదరు కంపెనీకి చెల్లించే ధర యథాతథంగా ఉంటుంది. పన్నులు తగ్గించడంవల్ల ప్రభుత్వ ఖజానాకు మాత్రం నష్టం వాటిల్లుతుంది. మరో విషయమేమిటంటే... ఎమ్మార్పీ తగ్గడంతో ఆ కంపెనీ మద్యం సేల్స్‌ ఒక్కసారిగా పుంజుకోనున్నాయి. అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ)ను రేషనలైజ్‌ పేరిట ఈనెల 17న జీవో 556ను జారీచేశారు. అన్ని కంపెనీలకు ఒకే విధమైన పన్నులు వర్తింపజేసేందుకేనంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని బ్రాండ్ల ధరలు పెరిగాయి. కానీ, మరికొన్ని బ్రాండ్ల రేట్లు తగ్గిపోయాయి. అది కూడా ఐదో, పదో కాకుండా ఏకంగా వందల రూపాయలు తగ్గడం వెనుక మద్యం కంపెనీలకు మేలు చేసే ఉద్దేశం స్పష్టమవుతోంది. ఆ కంపెనీలకు మేలు ఎలాగంటే ?

రాష్ట్రంలో అమ్మే ప్రతి మద్యం బ్రాండ్‌ కంపెనీతో ఎక్సైజ్‌ శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అవి సరఫరా చేసే మద్యం బాటిళ్లపై కంపెనీలకు ఎంత ధర చెల్లించాలనేది ఎక్సైజ్‌లో ఓ కమిటీ ఒప్పంద సమయంలోనే నిర్ణయిస్తుంది. అనంతరం ఆ మూల ధరపై ప్రభుత్వం రకరకాల పన్నులు వేస్తుంది.

ఆ పన్నులు పెరిగినా, తగ్గినా మద్యం కంపెనీలకు ఇచ్చే ఒప్పంద ధరలో ఎలాంటి మార్పూ ఉండదు. ఉదాహరణకు రూ.200 ఎమ్మార్పీ ఉన్న బాటిల్‌ను మద్యం కంపెనీ ప్రభుత్వానికి ఇస్తే... అందులో సుమారు రూ.20 ఆ కంపెనీకి వెళ్తుంది. పన్నులు సవరించి ఆ బాటిల్‌ ధరను రూ.150 చేసినా లేదా రూ.250 చేసినా కంపెనీకి రూ.20 మాత్రమే ఇస్తారు. అలా ధరలు సవరించి ఎమ్మార్పీ తగ్గించేసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా ఎక్సైజ్‌ శాఖ సరిగ్గా అదే చేసింది. వివిధ బ్రాండ్లకు చెందిన 250 రకాల బాటిళ్లపై ఒక్కసారిగా రేట్లు తగ్గించేసింది. ఏసీపీ ప్రిస్టేజ్‌ డీలక్స్‌ విస్కీ లీటరు బాటిల్‌ ధర మొన్నటి వరకూ రూ.760 ఉంటే ఇప్పుడు అది రూ.430కి తగ్గిపోయింది. అంటే ఒకేసారి రూ.330 తగ్గింది. యాంటిక్విటీ ఎక్స్‌ఆర్‌ బ్లెండెడ్‌ బ్రాందీ 750 ఎంఎల్‌ ధరను రూ.1,520 నుంచి రూ.1,340కు తగ్గించింది. ఎనీటైమ్‌ గోల్డ్‌ విస్కీ లీటరు సీసా ధరను రూ.780 నుంచి రూ.460కు, యాపిల్‌ ప్రీమియం వోడ్కా 750 ఎంఎల్‌ సీసా ధరను రూ.710 నుంచి 620కు, కింగ్‌ ఫిషర్‌ బీరు ధరను రూ.170 నుంచి రూ.130కు తగ్గించింది.

ఆ బ్రాండ్ల వ్యాపారం పెంచేలా...

ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో వల్ల పలు మద్యం కంపెనీలకు కోట్లలో లాభం వచ్చి పడుతుంది. ఎందుకంటే ధర తగ్గిన బ్రాండ్లు వేగంగా అమ్ముడుపోతాయి. ఒక్క సీసాపైనే రూ.330 తగ్గించారంటే జనం ఎగబడి కొనే పరిస్థితి వస్తుంది. ఫలితంగా ఆ బ్రాండ్లు సరఫరా చేసే కంపెనీలకు వ్యాపారం పెరుగుతుంది. కానీ, ప్రభుత్వానికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. పోనీ రేషనలైజేషన్‌లో నిజాయితీ ఉందా? అని పరిశీలిస్తే ఇప్పుడు భారీగా ధరలు తగ్గించిన బ్రాండ్లకు గతంలో అంత ధర పెట్టకూడదు. ఏఆర్‌ఈటీ అనే పన్ను గతంలోనూ అటూ ఇటూగా ఒకేవిధంగా అన్ని బ్రాండ్లకూ వర్తించింది. అంటే ఒక్క సీసాపైనే రూ.330 వ్యత్యాసం రాదు. కానీ గతంలో అలా ఎందుకు ఎమ్మార్పీ నిర్ణయించారు? ఇప్పుడెందుకు తగ్గించారు? అనేది ఎక్సైజ్‌ శాఖకే తెలియాలి. మరోవైపు ఎమ్మార్పీ పెరిగిన బ్రాండ్లకు వ్యాపారం తగ్గి, అవి నష్టపోయే అవకాశాలున్నాయి.

లబ్ధి ఎవరికి..?

గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు మేళ్లు జరిగాయని సీఐడీ ఇటీవల కేసు నమోదుచేసింది. అప్పటి సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. అప్పట్లో కొన్ని డిస్టిలరీలకు కావాలని అనుమతులిచ్చారని, ఎస్పీవై డిస్టిలరీకి ఆర్థిక ఉపశమనం కలిగించారని, మద్యం షాపుల నుంచి ప్రివిలేజ్‌ ఫీజులు వసూలు చేయలేదని, వీటి ఫలితంగా ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చిందనేది సీఐడీ వాదన. సరిగ్గా ఆ కేసు నమోదుచేసిన నెలలోపే ఇంత భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరి మేలు కోసం వాటి ధరలు తగ్గించి, వ్యాపారాన్ని పెంచే ప్రయత్నం మొదలుపెట్టారు? కొన్ని కంపెనీలకు నష్టం కలిగేలా వాటి ఎమ్మార్పీ ఎందుకు పెంచారు?ఈ మార్పుల వల్ల ప్రభుత్వంలో ఎవరికి ఆర్థిక లబ్ధి చేకూరింది? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జీవో 556 తెచ్చే నష్టం ఎంతో రాబోయే నెలల్లో కనిపించనుంది.

మనకు నచ్చితే ఓకే..

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం వ్యాపారమంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. చాలా డిస్టిలరీలు పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతల చేతిలోనే ఉన్నాయి. ఇతరత్రా కంపెనీలు మద్యం అమ్మాలంటే కేసుకు రూ.250 కప్పం కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఓకే అన్న కంపెనీలే ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్ముతున్నాయి. అందుకు అంగీకరించని కంపెనీలు వ్యాపారాన్ని వదిలేసుకుని వెళ్లిపోయాయి. పైగా గత ప్రభుత్వంలో ఉన్న రూ.400 కోట్ల బకాయిలను ప్రభుత్వం కంపెనీలకు విడుదల చేయలేదు. ఆ బకాయిలు అడిగితే ఇప్పుడు ‘వ్యాపారం వద్దా’ అనే ప్రశ్న ప్రభుత్వం నుంచి వస్తోంది. దీంతో వందల కోట్ల వ్యాపారం చేసే మద్యం కంపెనీలు వేరే దారి లేక బకాయిలు ఇవ్వకపోయినా, వారికి ఇచ్చే మూల ధర పెంచకపోయినా అయిష్టంగానే వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కొన్ని కంపెనీలకు మేలు చేసేలా ప్రభుత్వం ధరలు సవరించింది.

Updated Date - 2023-11-21T03:13:49+05:30 IST