రోజాకి సభ్యత, సంస్కారం ఎక్కడ?
ABN , First Publish Date - 2023-09-22T03:37:09+05:30 IST
‘మంత్రి రోజా ఒక మహిళ అయ్యుండీ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతోంది. ఆమె సభ్యత, సంస్కారం ఎక్కడికి వెళ్లాయి?
ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే లోకేశ్ అరెస్టుకు ప్రణాళిక: అయ్యన్న
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం), సెప్టెంబరు 21: ‘‘మంత్రి రోజా ఒక మహిళ అయ్యుండీ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతోంది. ఆమె సభ్యత, సంస్కారం ఎక్కడికి వెళ్లాయి?’’ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎంవీపీ కాలనీలో నిర్వహిస్తున్న దీక్షల్లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘లోకేశ్‌ను ఎవరికి పుట్టావ్ అని మంత్రి రోజా అడుగుతోంది. మరి నీ కొడుకు ఎవరికి పుట్టాడు? అని అడిగితే... నీకు ఎలా ఉంటుంది? సీఎం దృష్టిలో అభివృద్ధి అంటే కూల్చడం, దాచుకోవడం, దోచుకోవడమే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని రాజకీయ సమాధి చేయాలి. లోక కల్యాణం కోసం నా నర్సీపట్నం సీటును ఎవరికైనా ఇస్తా. చంద్రబాబుకు కూడా ఈ విషయం చెప్పా. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే లోకేశ్‌ను అరెస్టు చేయాలని చూస్తున్నారు’’ అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చోడె పట్టాభిరాం, బైరెడ్డి పోతనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.