సొమ్ములు ఎక్కడికి పోయాయ్!
ABN , First Publish Date - 2023-09-22T03:59:13+05:30 IST
స్కిల్ డెవల్‌పమెంట్ స్కీమ్‌లో చంద్రబాబు స్కామ్ చేశారా? మరి... ఫోక్స్‌వ్యాగన్ విషయంలో బొత్స చేసిందేమిటి? ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టిన రూ.370 కోట్ల ఖర్చుకు ఫలితాలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి.
‘ఫోక్స్’ను గుర్తుకు తెచ్చుకుంటున్న జనం
నాడు 11.5 కోట్లు సమర్పించిన బొత్స
స్కిల్ డెవల్‌పమెంట్‌లో కళ్లముందే ఫలితాలు
ఖర్చుకు లెక్కలున్నా స్కామ్ అంటూ ఆరోపణలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
స్కిల్ డెవల్‌పమెంట్ స్కీమ్‌లో చంద్రబాబు స్కామ్ చేశారా? మరి... ఫోక్స్‌వ్యాగన్ విషయంలో బొత్స చేసిందేమిటి? ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టిన రూ.370 కోట్ల ఖర్చుకు ఫలితాలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. మరి... ఫోక్స్ వ్యాగన్ కేసులో అప్పుడెప్పుడో 2005లో బొత్స చెల్లించిన సర్కారు సొమ్ము రూ.11.5 కోట్లు ఎక్కడికి పోయాయి? ‘ఏం చేస్తాం! డబ్బులు పోయాయ్’ అనగానే కేసు కూడా పోయినట్లేనా? అదే బొత్సను కేబినెట్‌లో నియమించుకున్న జగన్... స్కిల్ స్కామ్ అంటూ హడావుడి చేయడంలో అర్థమేమిటి? ఇవి సామాన్యులు సంధిస్తున్న ప్రశ్నలు! తాజా పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న చర్చ! విచిత్రమేమిటంటే ఇప్పుడు షెల్ కంపెనీలకు డబ్బులు పోయాయంటుండటగా... అప్పుడు అసలు ఉన్నాయో లేవో తెలియని కంపెనీలకు డబ్బులు కట్టబెట్టారు.
2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోక్స్‌వ్యాగన్ స్కామ్ చోటు చేసుకుంది. అదంతా అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి ఫోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ వస్తుందంటూ నాటి పరిశ్రమల శాఖ మంత్రి బొత్స ప్రకటించారు. విశాఖపట్నంలోనే వస్తుందని చెప్పారు. ప్రభుత్వం కంపెనీలకు రాయితీలు ఇస్తుంది. పరిశ్రమ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. కానీ... బొత్స సత్యనారాయణ ఏకంగా 11.5 కోట్ల ప్రజాధనం చెల్లించేశారు. జర్మనీకి చెందిన ఈ కంపెనీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న హెల్మత్ షుష్టర్ భారత్‌కు చెందిన జగదీప్ అలగ్‌రాజా, గాయత్రీ చంద్రవదన్, అశోక్‌కుమార్ జైన్, చతుర్వేది, జోషె్‌ఫలతో కలిసి ప్రభుత్వానికి టోపీ పెట్టారు. ఫోక్స్ వ్యాగన్ (వీడబ్ల్యూ) తరహాలోనే ‘వశిష్ఠ వాహన్’ (వీడబ్ల్యూ) పేరుతో కంపెనీ పెట్టి, ఖాతా తెరిచారు. విశాఖలో కార్ల కంపెనీ పెడతామని చెప్పగానే... మంత్రి బొత్స ఆదేశాల మేరకు ‘వశిష్ఠ వాహన్’ ఖాతాలో రూ.11.5 కోట్లు జమ చేశారు. అలా వేసిన కొన్ని నిమిషాలకే ఆ డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. రాష్ట్రానికి ఒక ప్రతిష్ఠాత్మక కార్ల కంపెనీని తీసుకొచ్చే సదుద్దేశంతోనే డబ్బులు చెల్లించామని...
చివరికి మోసపోయామని చెప్పుకోవడానికీ లేదు. ‘కార్ల కంపెనీ డీలర్‌షిప్ మొత్తం మీకే ఇస్తాం’ అని ఆఫర్ ఇచ్చినందుకే సొమ్ముల చెల్లింపునకు బొత్స ఉత్సాహం చూపించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నిజానికి... ఇలా మొత్తం డబ్బులు కంపెనీ ఖాతాలో వేయడం సరికాదని, స్పెషల్ పర్పస్ వెహికల్ పేరిట ఎస్ర్కో ఖాతాలో జమ చేయడమే మంచిదని అప్పట్లో అధికారులు చెప్పినా వినిపించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. తీరా చూస్తే విశాఖకు ఫోక్స్ వ్యాగన్ రాలేదు. ‘మీరు మోసపోయారు. మా పేరు వాడుకుని మిమ్మల్ని మోసగించారు’ అని ఫోక్స్‌వ్యాగన్ సంస్థ స్పష్టం చేసింది. దీని వెనుక షుష్టర్‌తోపాటు జగదీప్ అలగ్‌రాజా, గాయత్రీ చంద్రవదన్, అశోక్‌కుమార్ జైన్, చతుర్వేది, జోషెఫ్ ఉన్నారంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో బొత్సను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వశిష్ఠ వాహన్ సృష్టికర్తలతో బొత్స సమావేశమైనప్పుడు వేసుకున్న దుస్తుల రంగు.. కూర్చున్న సీటు తదితర అంశాలన్నింటిని సీబీఐ పూసగుచ్చినట్లుగా చెప్పింది. ఆ తర్వాత ఈ కేసులో బొత్సపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ‘సొమ్ములు పోయాయ్. ఏం చేస్తాం’ అంటూ బొత్స తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఫోక్స్ వ్యాగన్ కేసులో రాజకీయ అరెస్టులు కనిపించనే లేదు. అదే బొత్స ఆ తర్వాత మళ్లీ మళ్లీ మంత్రి అయ్యారు. ఇప్పు డు స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో టీడీపీ ప్రభుత్వం తరఫున చెల్లించిన రూ.370 కోట్లకు లెక్కలు న్నా, ఈ స్కీమ్ ఫలితాలు కనిపిస్తున్నా ‘స్కామ్ స్కామ్’ అంటూ ఏకంగా చంద్రబాబును అరెస్టు చేసింది! ‘ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా సహిం చం’ అంటున్న ప్రభుత్వ పెద్దలకు పాత విషయాలు గుర్తు లేవంటారా?