Share News

పోలవరంపై చిత్తశుద్ధి ఏది!

ABN , First Publish Date - 2023-12-07T04:43:38+05:30 IST

పోలవరం నిర్మాణ పనుల్లో రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. కీలకమైన నిర్మాణాన్నీ దెబ్బతిన్నప్పటికీ వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ లక్ష్యాలను నిర్దేశించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

పోలవరంపై చిత్తశుద్ధి ఏది!

వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి ఎలా సాధ్యం?

పనుల పురోగతిపై వాస్తవాలు చెప్పట్లేదు

భూసేకరణ సాగకపోవడంపై అసంతృప్తి

ఇతర పద్దులకు నిధుల మళ్లింపు పైనా ఆగ్రహం

రాష్ట్ర జల వనరుల శాఖపై కేంద్రం మండిపాటు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం నిర్మాణ పనుల్లో రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపిస్తోంది. కీలకమైన నిర్మాణాన్నీ దెబ్బతిన్నప్పటికీ వచ్చే జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ లక్ష్యాలను నిర్దేశించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆమోదించిన రూ.20,398.61 కోట్ల పరిమితి దాటిపోయింది. తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధులు పోను రూ.15,505.81 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ పరిఽధిలోని సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సీసీ) అధ్యయనం చేస్తోంది. మరో పది రోజుల్లో ఈ నివేదిక కేంద్ర జలశక్తి శాఖకు అందనుంది. తర్వాత దాన్ని కేబినెట్‌కు పంపుతారు. జాతీయ హోదా ఉన్న పోలవరాన్ని కేంద్రమే నిర్మించాల్సి ఉండగా, ఆ బాధ్యతను రాష్ట్రం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున కాంట్రాక్టు సంస్థగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి తొలుత నిధులు వ్యయం చేసిన తర్వాత కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్‌ తీసుకుంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగానో, ఎన్నికల్లోగా పూర్తిచేయలేమని నిర్ధారణకు వచ్చినందునో... కారణం ఏమైనప్పటికీ ఇటీవల ఈ ప్రాజెక్టుపై ముందస్తుగా వ్యయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. దీంతో నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయి. పనుల బాధ్యత తీసుకున్నందున ముందుగా నిధులు ఖర్చుచేస్తే రీయింబర్స్‌మెంట్‌ చేస్తామంటూ కేంద్రం చెబుతుండగా, నిధులు ముందుగానే ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అయితే ఇచ్చిన నిధులు ఇతర పద్దులకు మళ్లించడాన్ని కేంద్రం తప్పుబడుతోంది. తాము ఇచ్చిన నిధులు పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే వ్యయం చేయాలని స్పష్టం చేస్తోంది. భూసేకరణ పనులు ముందుకు సాగకపోవడంపైనా కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

అప్పటి వరకూ అనిశ్చితే...

పోలవరం ప్రాజెక్టును 2024 జూలై నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ చెబుతున్న మాటలను జలశక్తి శాఖ విశ్వసించడం లేదు. డయాఫ్రమ్‌వాల్‌ కొత్తగా నిర్మించాలంటే కనీసం 19 నెలలు పడుతుందని చెబుతోంది. ఒక సీజన్‌ను ఆరు నెలలుగా లెక్కిస్తే డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి దాదాపు రెండేళ్లు, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి రెండు సీజన్లు అంటే అదో ఏడాది పడుతుందని చెబుతుంది. అంటే.. డయాఫ్రమ్‌వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం సాంకేతికంగా తీసుకుంటుందని మంగళవారం ఢిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమీక్షలో తేల్చింది. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ సమయంలోనే ఎగువ కాఫర్‌ డ్యామ్‌, గైడ్‌బండ్‌ మరమ్మతు పనులు కూడా చేయవచ్చని కేంద్రం అభిప్రాయపడిం ది. ఈ లెక్కన వాతావరణం సహకరించి 2024 నుంచి డయాఫ్రమ్‌వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌, ఎగువ కాఫ ర్‌ డ్యామ్‌ సీపేజీ అరికట్టడం, గైడ్‌బండ్‌ నిర్మాణాలను సమాంతరంగా చేపడితే 2028 డిసెంబరు నాటికి పోలవరం పూర్తవుతుందని కేంద్ర జలశక్తి అంచనా వేస్తోంది. కానీ నిర్మాణ పనుల్లో రాష్ట్రానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని, వాస్తవ సమాచారాన్ని ఇవ్వడం లేదని దేబర్షి ముఖర్జితో పాటు కేంద్ర జలశక్తి సలహాదారు వెదురె శ్రీరామ్‌ మంగళవారం జరిగిన సమీక్షలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర జల వనరుల శాఖతో మరోసారి భేటీ అయ్యాక పోలవరం షెడ్యూల్‌ను ఖరారుచేయాలన్న యోచనలో జలశక్తి శాఖ ఉంది. అప్పటి వరకూ అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అంతా ఊహాజనితమే..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణమంతా ఊహాజనితంగా సాగుతోందని, వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదని కేంద్ర జలశక్తి భావిస్తోంది. పోలవరం నిర్మాణాలపై వాస్తవాలను చెప్పకుండా భ్రమల్లో ఉంచుతున్నారని అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర జల వనరుల శాఖ చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోతోందని, ఇందుకు ప్రాజెక్టు స్థలంలో చిద్రమైన నిర్మాణాలే ఉదాహరణగా పేర్కొంటోంది. పోలవరం ప్రాజెక్టు గైడ్‌బండ్‌ కుంగిపోయింది. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నుంచి భారీగా సీపేజీ వస్తోంది. దీనికి ఎలా అడ్డుకట్టవేయాలో నిర్మాణ సంస్థకు తెలియడం లేదు. దీంతో గైడ్‌బండ్‌, డయాఫ్రమ్‌వాల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ మరమ్మతు, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు వరుసగా చేపట్టాల్సి వచ్చింది. దెబ్బతిన్న నిర్మాణాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. గైడ్‌బండ్‌ను కొత్తగా నిర్మించాల్సిందేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మధ్యలో బంకమట్టి ముద్దలు చేరడంతో గైడ్‌బండ్‌ నిలవడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్త ప్లాస్టిక్‌ డయాఫ్రమ్‌వాల్‌ను, దానిపై ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించాలని రాష్ట్ర జల వనరుల శాఖ భావిస్తోంది. ఈ కట్టడాలన్నింటికీ ఇప్పటికిప్పుడు డిజైన్లు అందుబాటులో ఉన్నా నిర్మాణ పనులకు కనీసం ఆరు సీజన్లు పడుతుందని కేంద్ర జలశక్తి అంచనా వేస్తోంది.

Updated Date - 2023-12-07T04:43:40+05:30 IST