Tirupathi fire accident: గోవిందరాజస్వామి వారి ఆలయంలో వరుస ప్రమాదాలకు కారణమేంటి..?

ABN , First Publish Date - 2023-06-16T13:50:44+05:30 IST

స్వామివారి రథోత్సవం చూసేందుకు, స్వామివారి రథాన్ని లాగేందుకు ఎక్కడెక్కడి జనం తరలివస్తారు. రథోత్సవానికి ఎనలేని ప్రాసశ్యం ఉంది. అయితే తిరుపతిలోని గోవిందరాజస్వామివారి రథం అగ్నికీలల్లో చిక్కుకోవడం భక్తుల మనసును కల్లోల పరుస్తోంది. మొన్ననే ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థవృక్షం కూలిపోయి ఓ భక్తుడు మృతి చెందిన చేదు సంఘటనను మరవకముందే స్వామివారి రథం అగ్నిప్రమాదంలో చిక్కుకోవడం మనసులను కలిచివేస్తోంది.

Tirupathi fire accident: గోవిందరాజస్వామి వారి ఆలయంలో వరుస ప్రమాదాలకు కారణమేంటి..?

రథస్తం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే... అంటారు. అంటే రథంపై ఊరేగే స్వామివారిని చూసే భక్తులకు పునర్జన్మ ఉండదని అర్థం. తిరుమల, తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలలో 8వరోజు ఉదయం స్వామివారికి రథోత్సవం జరపడం సంప్రదాయం. ఆ రోజున భక్తజనం పోటెత్తుతారు. స్వామివారి రథాన్ని లాగి తమ జన్మ పావనమైందని సంబరపడతారు. పైగా రథంపై మాధవుడిని చూస్తే పునర్జన్మ ఉండదని అంటారు. అందుకే స్వామివారి రథోత్సవం చూసేందుకు, స్వామివారి రథాన్ని లాగేందుకు ఎక్కడెక్కడి జనం తరలివస్తారు. రథోత్సవానికి ఎనలేని ప్రాసశ్యం ఉంది. అయితే తిరుపతిలోని గోవిందరాజస్వామివారి రథం అగ్నికీలల్లో చిక్కుకోవడం భక్తుల మనసును కల్లోల పరుస్తోంది. మొన్ననే ఆలయ ప్రాంగణంలోని అశ్వర్థవృక్షం కూలిపోయి ఓ భక్తుడు మృతి చెందిన చేదు సంఘటనను మరవకముందే స్వామివారి రథం అగ్నిప్రమాదంలో చిక్కుకోవడం మనసులను కలిచివేస్తోంది. తిరుపతిలో దిగిన భక్తులకు ముందుస్వాగతం పలికేది గోవిందరాజస్వామివారి ఆలయమే. విశాలమైన ప్రాంగణం ఈ ఆలయం సొంత. పెద్ద ఎత్తున ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో చూడవచ్చు. నిత్యం ఏదో ఒక ఉత్సవంతో ఆలయం కళకళలాడుతుంటుంది. అయితే వరుస ప్రమాదాలు ఏదో అపశృతిని సూచిస్తున్నాయి.

తిరుపతి నగరం ఓనాడు కుగ్రామం. అప్పట్లో ప్రస్తుతం గోవిందరాజస్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో మాత్రమే జనసంచారం, నివాసాలు ఉండేవి. అందుకే ఈ ప్రాంతానికి గోవిందరాజపురమనే పేరు ఉండేది. ఈ గోవిందరాజపురమే కాలక్రమంలో తిరుపతిగా మారింది. అయితే ఆనాటి నుంచి నేటివరకు గోవిందరాజస్వామివారి ఆలయ పరిసరాలలో ఎటువంటి మార్పూ రాలేదు. ఆలయ మాడవీధులన్నీ ఇరుకుగా ఉంటాయి. తూర్పు మాడవీధి అయితే పూర్తి మెయిన్‌రోడ్డుగా మారిపోయింది. దక్షిణ, ఉత్తర మాడవీధులు ఇరుకు సందులుగా కనిపిస్తాయి. ఇక పడమర మాడవీధిలో కీలకమైన ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఉండటం వలన ఇక్కడ నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో రద్దీగా ఉంటుంది. ఇలా మాడవీధులన్నీ ఇరుకు సందులైపోవడంతో స్వామివారి ఊరేగింపులు పెద్దమాడవీధుల పేరుతో కిలోమీటర్ల కొద్దీ మెయిన్‌రోడ్లపైనే తిప్పుతుంటారు. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన లావణ్య లామినేషన్‌ భవనం ఉత్తర మాడవీధి మొదట్లో ఉంటుంది. ఈ వీధి మొదట్లోనే ఓ పక్కగా స్వామివారి రథాన్ని నిలిపి ఉంచుతారు. నిజానికి ఈ రథం చుట్టూ రేకులతో రక్షణ కవచం ఉంటుంది. బహుశా మొన్నే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి కాబట్టి ఆ రేకులను తొలగించారు. వాటిని ఇంకా అమర్చలేదు. దీంతో లావణ్య ఫోటో ఫ్రేముల కంపెనీలో అంటుకున్న మంటలు ఈ రథాన్ని కూడా తాకాయి. అసలే ఇరుకు వీధులు కావడం, చుట్టూ అనేక బొమ్మల దుకాణాలు ఉండటంతో భక్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపుచేస్తున్నప్పటికీ ఈ ప్రమాదం కచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికైనా టీటీడీ తిరుమలపై పెట్టే శ్రద్ధలో పదోవంతైనా స్థానిక ఆలయాలపై పెడితే ఇటువంటి ప్రమాదాలు జరగవని భక్తులు అంటున్నారు. గోవిందరాజస్వామి వారి ఆలయ మాడవీధుల విస్తరణపై దృష్టిసారిస్తే భవిష్యత్తులోనైనా ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక మొన్ననే చల్లగా చూడుస్వామి అంటూ తిరుమల మొదటిఘాట్‌రోడ్డు ఏడోమైలు వద్ద టీటీడీ శాంతి హోమం చేసింది. ఘాట్‌రోడ్డుపై అదేపనిగా వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ హోమం చేసింది. అదృష్టం ఏమిటంటే ఈ ప్రమాదంలో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. అసలు సహజంగా తిరుమల కొండమార్గంలో ప్రమాదాలు ఎక్కువగానే జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి కనుమ మార్గం మలుపుల మయం. కొత్తగా వచ్చేవారికి ఈ మలుపుల కిటుకు తెలియదు. అందుకే నేరుగా రైలింగ్‌లను గుద్దుతూ ఉంటారు. అయితే దేవుడి దయ ఉంటుంది కాబట్టి ప్రాణనష్టం ఎప్పడూ జరగదు. కానీ ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో అటు భక్తులతోపాటు ఇటు టీటీడీ యంత్రాంగం కూడా కలవరానికి గురైంది. అందుకే శాంతి హోమం చేసి చల్లగా చూడు తండ్రి అని శ్రీనివాసుడిని వేడుకుంది. మరి తిరుపతిలో జరిగే ప్రమాదాల గురించి కూడా టీటీడీ ఏదైనా పరిహార హోమాలు చేస్తుందేమో చూడాలి.

Updated Date - 2023-06-16T13:50:44+05:30 IST