పార్కుపై పట్టింపేది?
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:44 PM
పట్టణంలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యతంటూ గతంలో అభివృద్ధి చేసిన పార్కులు నిరుపయోగంగా మారుతున్నా వాటిని పట్టించుకున్న తాఖలాలు కనిపించడం లేదనేందుకు కేజీ రోడ్డు పక్కనే ఉన్న పార్కే నిదర్శనం.
నిర్లక్షం నీడలో.. జనం లేని వనం
మందుబాబులు పగులకొట్టిన సిమెంటు బెంచీలు
జూపాడుబంగ్లా, డిసెంబరు 17: పట్టణంలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యతంటూ గతంలో అభివృద్ధి చేసిన పార్కులు నిరుపయోగంగా మారుతున్నా వాటిని పట్టించుకున్న తాఖలాలు కనిపించడం లేదనేందుకు కేజీ రోడ్డు పక్కనే ఉన్న పార్కే నిదర్శనం. ప్రజలకు ఆహ్లాదవాతావరణం, ప్రశాంతత కోసం ఉద్యానవనాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎంపీడీవో, ప్రభుత్వవైద్యశాల, తహసీల్దార్ కార్యాలయాలకు ఎదురుగా అరెకరా స్థలంలో రూ. 4 .50లక్షలతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. అప్పట్లో దీని నిర్వహణను గ్రామపంచాయతీకి అప్పగించారు. పార్కు కంచెలో అందంగా ఆహ్లాదకరంగా మొక్కలతో తీర్చిదిద్దారు. వృద్ధులు, పిల్లలు, యువత కూర్చొడానికి సిమెంటుబెంచీలు కూడా ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతీనుంచి గ్రామపంచాయతీకి తగినంత నిధులు ఇవ్వకపోవడంతో రోజురోజుకు ఉద్యానవనం జనంలేని వనంలా కళాహీనంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ ఆహ్లాదవాతావరణం కనిపించడం లేదు. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. పార్కులో ఏర్పాటు చేసిన సిమెంటుబెంచీలను మందుబాబులు యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న పట్టించుకునే నాధుడే కరవయ్యారని స్థానికులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో పార్కుకు ఉన్న ఇనుపకంచె పడిపోయింది. కనీసం గేటుకు తాళం వేసే వారులేక పశువులు, పందులు మొక్కలను నాశనం చేస్తున్నాయి. కంపచెట్లు మొలిచాయి. కుళాయి పైపుల లీకేజీ కారణంగా మురికినీరు నిలిచి దుర్గంఽధం వెదజల్లుతోంది. గ్రామపంచాయతీ తరపున వాచ్‌మెన్ ఏర్పాటు చేస్తే ఉద్యానవనం పచ్చగా కళకళలాడుతూ అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి సౌకర్యాలులేకపోవడంతో పార్కులో కూర్చొవడానికి ఆసక్తి చూపడంలేదు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సామేలును వివరణకోరగా పంచాయతీ తరపున అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు.