EMset: ఎంసెట్ ఫలితాలకు ‘తెలంగాణ’ అడ్డంకి!
ABN , First Publish Date - 2023-06-07T03:08:15+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్–2023 ఫలితాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డంకిగా మారింది. అక్కడి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏపీలో ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది.
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
తెలంగాణ విద్యార్థుల మార్కులు ఇవ్వకపోవడంతో
ఫలితాల విడుదలలో జాప్యం.. అడ్మిషన్లపై ప్రభావం
పది రోజుల కిందటే టీ–ఎంసెట్ ఫలితాలు విడుదల
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్–2023 ఫలితాలకు తెలంగాణ రాష్ట్రం అడ్డంకిగా మారింది. అక్కడి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏపీలో ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలై పది రోజులు దాటిపోయింది. ఏపీ విద్యార్థుల ఫలితాలు సిద్ధంచేసిన ఉన్నత విద్యామండలి తెలంగాణ ఇంటర్ మార్కుల వివరాల కోసం ఎదురుచూస్తోంది. రెండేళ్లుగా రాష్ట్రంలో ఈఏపీసెట్ ఫలితాలకు ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇవ్వలేదు. కొవిడ్ వల్ల పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నందున పాత విధానాన్ని పునరుద్ధరించి, ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఈఏపీసెట్‌లో వచ్చే మార్కులు, ఇంటర్‌లో వచ్చిన మార్కులను నార్మలైజేషన్ చేసి తుది మార్కులు, ర్యాంకులు ప్రకటిస్తారు. ఏపీ ఇంటర్ విద్యాశాఖ నుంచి ఇంటర్ మార్కులు తీసుకుని, ఏపీ విద్యార్థుల వరకు ఫలితాల నార్మలైజేషన్‌ను దాదాపుగా పూర్తిచేశారు.
కాగా, ఈ సారి 18 వేల మంది తెలంగాణ విద్యార్థులు ఏపీఈఏపీసెట్ రాశారు. దీంతో వారి ఇంటర్ మార్కుల వివరాలు కూడా వస్తే నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గత వారం రోజులుగా ఏపీ ఉన్నత విద్యామండలి ఆయా విద్యార్థుల మార్కుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ అధికారులను కోరుతున్నా ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ వస్తున్నారు. దీంతో ఆ 18వేల మంది విద్యార్థుల కోసం ఎంసెట్ ఫలితాలు విడుదలలో జాప్యం జరుగుతోంది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఈఏపీసెట్ పరీక్షకు ఇంటర్ మార్కుల వెయిటేజీ తీసుకోబోమని ప్రకటించింది. దీంతో మే 25నే తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు కూడా విడుదల చేసింది. తమ ప్రభుత్వంలోనే తీసుకోనప్పుడు, ఏపీకి ఇవ్వాలా? అనే ఉద్దేశంతో తెలంగాణ అధికారులు తాత్సారం చేస్తున్నారేమోనన్న వాదన వినిపిస్తోంది.
ఇక్కడ వద్దన్నా వినలేదు
ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేకపోతే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చాలా సులభం అవుతుంది. అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే కావడంతో మూల్యాంకనం చాలా వేగంగా పూర్తవుతుంది. కానీ వెయిటేజీ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టింది.
అడ్మిషన్లపై ప్రభావం
ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాక ఇంజనీరింగ్ ప్రవేశాలకు షెడ్యూలు విడుదల చేస్తారు. అనేక మంది విద్యార్థులు తెలంగాణ ఈఏపీసెట్, వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం లాంటి ప్రవేశ పరీక్షలూ రాశారు. డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ ఫలితాల్లో జరుగుతున్న జాప్యం వల్ల ఏపీలో ఇంజినీరింగ్ అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.