Share News

Krishna waters : గాలిలో జల‘యజ్ఞం’

ABN , First Publish Date - 2023-11-20T04:12:18+05:30 IST

జగన్‌ సర్కారు వచ్చాక పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై దృష్టిసారించడం లేదు. కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు.

Krishna waters : గాలిలో జల‘యజ్ఞం’

లక్ష ఎకరాలట!

‘తాగు, సాగు నీటి సరఫరా కోసం ప్రాజెక్టులను చేపడుతున్నాం. ప్రాజెక్టులపై రూ.32 వేల కోట్ల వ్యయం. ఇప్పటికే లక్ష ఎకరాల అదనపు ఆయకట్టును అందు బాటులోకి తెచ్చాం. 4 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాం’.

‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ బ్రోచర్‌లో ప్రభుత్వం చెప్పిన మాటిది.

ఇదీ వాస్తవం

జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టే కాదు.. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని పథకాలూ పెండింగ్‌లోనే ఉన్నాయి. అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. రాష్ట్రాని కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచేశారు. ఎప్పటికి పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో కూడా చెప్పలేని స్థితికి తీసుకొచ్చారు. నిర్మాణంలో ఉన్న చిన్న ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించకుండా అసంపూర్తిగా వదిలేశారు.

పోలవరాన్ని నాశనం చేసేశారు

కృష్ణా జలాలపై రాష్ట్రానికి తీరని ద్రోహం

సాగు ప్రాజెక్టులను అటకెక్కించారు

సీమను దుర్భిక్షంలోకి నెడుతున్నారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు వచ్చాక పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై దృష్టిసారించడం లేదు. కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. రాష్ట్ర రైతాంగంలో అత్యధికులు కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నారు. మూడింట రెండొంతుల భూభాగానికి అవే ఆధారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో.. విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఈ ఏర్పాటే ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ప్రాతిపదికన.. రెండు రాష్ట్రాలకు చెరిసగం జలాలను కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది. కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. దాని వాదనకు మద్దతుగా మోదీ ప్రభుత్వం.. గతనెల 4న రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపకాలను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. కేబినెట్‌లో ఆమోదించి గెజిట్‌ కూడా విడుదల చేసినా.. ఇంతవరకు సీఎం జగన్‌ నోరువిప్పలేదు. మోదీ నిర్ణయంతో రాష్ట్రం.. ప్రధానంగా రాయలసీమ తీవ్ర దుర్భిక్షంలోకి వెళ్తుందని తెలిసినా కిమ్మనడం లేదు. గత నెల 9న కృష్ణా జలాలపై జరిగిన ఆయన సమీక్ష జరిపారు. మోదీ, అమిత్‌షాకు కృష్ణా జలాల విషయంలో అభ్యంతరం తెలుపుతూ లేఖ రాయాలని న్యాయ నిపుణులు ఆయనకు సలహా ఇచ్చారు. ఆయన సరేనన్నారని అధికారికంగా ప్రకటన కూడా జారీచేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఆ లేఖను కూడా సిద్ధం చేసింది. కానీ ఇప్పటి వరకూ దానిపై ఆయన సంతకం చేయలేదు. ప్రధాని, షాకు లేఖ పంపనేలేదు. ఇప్పటికే కృష్ణా నదిపై అదనంగా 255 టీఎంసీల వినియోగించుకునేలా తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అంటే.. 299 టీఎంసీలకు అదనంగా మరో 255 టీఎంసీల జలాలను వాడేస్తే.. తెలంగాణ మొత్తంగా 554 టీఎంసీలు వినియోగించుకునేందుకు వీలుంది.

పోలవరం కకావికలం..

జగన్‌ అధికార పగ్గాలు చేపట్టేనాటికి.. పోలవరం ప్రాజెక్టు 72శాతం పూర్తయింది. అప్పటికే పటిష్ఠమైన డయాఫ్రం వాల్‌ను వేసినందున.. దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంను నిర్మిస్తే.. గోదావరి జలాలు స్పిల్‌ చానల్‌, స్పిల్‌వే మీదుగా కిందకు ప్రవహించేవి. కానీ అడ్డగోలు ఆరోపణలు, రివర్స్‌ టెండరింగ్‌తో అమూల్యమైన కాలాన్ని వృథా చేశారు. వరదలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ముంపుబారిన పడింది. డయాఫ్రం వాల్‌ బాగా దెబ్బతింది. దానికి మరమ్మతులు చేయాలా.. కొత్తది నిర్మించాలా అనే అంశంపై కేంద్రం ఎటూ చెప్పడం లేదు. ఇదే సమయంలో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ ఎగదన్నుతోంది. వీటికేం చేయాలో కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ప్రాజెక్టును 2020లో పూర్తిచేస్తామని.. ఆ తర్వాత 2021లో కట్టి చూపిస్తామంటూ సీఎం, నాటి జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ చేసిన ప్రకటనలు ప్రగల్భాలేనని తేలిపోయింది.

ప్రాజెక్టులపై ఖర్చేదీ?

గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,293.94 కోట్లు ఖర్చుపెట్టారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో సాగునీటి రంగంపై బడ్జెట్‌లో జగన్‌ ఖర్చుపెట్టింది కేవలం 2.35 శాతమే. రాయలసీమలో అత్యంత కీలకమైన హంద్రీ-నీవా సుజల స్రవంతిని 2020కే పూర్తి చేస్తానని జగన్‌ ప్రకటించారు. ఇప్పటికీ దిక్కులేదు. గాలేరు-నగరి పనుల పరిస్థితీ ఇంతే. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ను నిర్లక్ష్యం చేశారు. వేదవతి పనులు నిలిపివేశారు. కేవలం 7శాతం మిగిలి ఉన్న ఎస్‌ఆర్‌బీసీ పనులు కూడా పూర్తికాలేదు. గండికోటలో 4 శాతం మిగిలి ఉన్న పనులూ పడకేశాయి. పెన్నహోబిలం బ్యా లెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) ఫేజ్‌-2కు కేవలం రూ.42 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయిపోయేది. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌లో 30శాతం పనుల కోసం రూ.18 కోట్లు వ్యయం చేస్తే సరిపోయేది. కానీ పైసా కూడా విదల్చలేదు. సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-1 పనులూ ఆగిపోయాయి. ముచ్చుమర్రి ఎత్తిపోతల నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) పనులు చేయలేక కాంట్రాక్టరు వెళ్లిపోయారు. గుండ్రేవుల పథకం అటకెక్కింది. సిద్ధాపురం పనులు నిలిచిపోయాయి. ఇసుక మాఫియా దెబ్బకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తానని అట్టహాసంగా జగన్‌ ప్రకటించారు. దీనిపై తెలంగాణ ఎన్‌జీటీని ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. స్టే ఎత్తివేయించేందుకు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. రాయలసీమ దుర్భిక్ష నివారణను గాలికి వదిలేశారు.

Updated Date - 2023-11-20T06:08:22+05:30 IST