Share News

వృద్ధురాలికి వలంటీర్‌ బురిడీ..!

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:20 AM

అసలే వృద్ధురాలు.. గ్రామంలో ఆమెకంటూ ఎవరూ లేరు. ఇదే అదనుగా ఆమె పేరిట ఉన్న 2.77 ఎకరాల భూమిని కాజేయాలని గ్రామ వలంటీర్‌, అతని స్నేహితుడు కుట్రపన్నారు.

వృద్ధురాలికి వలంటీర్‌ బురిడీ..!

పింఛన్‌ బదిలీ చేయిస్తానని అగ్రిమెంట్‌పై సంతకం

ఆమె సమీప బంధువుతో కలసి ఆస్తి కాజేసే కుట్ర

పుట్లూరు, డిసెంబరు 16: అసలే వృద్ధురాలు.. గ్రామంలో ఆమెకంటూ ఎవరూ లేరు. ఇదే అదనుగా ఆమె పేరిట ఉన్న 2.77 ఎకరాల భూమిని కాజేయాలని గ్రామ వలంటీర్‌, అతని స్నేహితుడు కుట్రపన్నారు. ఫించను బదిలీ చేయిస్తామని నమ్మించి... ఆమె నుంచి ఆస్తి కొనుగోలు చేసినట్టు అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌కు రావడం లేదని లీగ ల్‌ నోటీసు పంపించారు. అవాక్కయిన బాధితురాలు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కుట్ర బయటపడింది. అనంతపురం జిల్లాలో శనివారం ఈ సంఘటన వెలుగుచూసింది. పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన బా ణా నాగేశ్వరమ్మకు వితంతు పింఛన్‌ వస్తోంది. ఇదే మండలంలోని ఓబుళాపురంలో బంధువుల వద్ద ఉంటోంది. గ్రామ వలంటీరు రమేశ్‌, కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన అతని స్నేహితుడు నరేశ్‌.. ఆమె ఆస్తిపై కన్నేశారు. పింఛన్‌ను ఓబుళాపురం గ్రామానికి మార్పిస్తామని చెప్పి బయోమెట్రిక్‌తోపాటు అగ్రిమెంట్‌ స్టాంప్‌ పేపర్‌పై ఆమెచేత వేలిముద్రలు వేయించారు. బాణా నాగేశ్వరమ్మకు నరేశ్‌ సమీప బంధువు. శనగలగూడూరు సర్వే నంబర్లు 2188-1, 1577లో ఉన్న 2.77 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సుమారు 20 రోజుల క్రితం అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. ఆ తర్వాత ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు రావడం లేదని ఆమెకు లీగల్‌ నోటీసులు పంపించారు. దీంతో బాధితురాలు తనను మోసగించిన వలంటీరు రమేశ్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఇద్దరిపైనా కేసు నమోదైంది.

Updated Date - Dec 17 , 2023 | 05:20 AM