ఇతర ఖైదీల్లానే వివేకా నిందితులకు సౌకర్యాలు

ABN , First Publish Date - 2023-06-02T04:42:35+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు ఇతర ఖైదీల్లానే ములాఖత్‌, టెలిఫోన్‌, క్యాంటీన్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి తెలిపారు.

ఇతర ఖైదీల్లానే వివేకా నిందితులకు సౌకర్యాలు

● ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై చంచల్‌గూడ జైలు అధికారి వివరణ

● ఇతర అంశాల ప్రస్తావన లేదు.. ఏపీ జైళ్ల శాఖలో చర్చ

అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు ఇతర ఖైదీల్లానే ములాఖత్‌, టెలిఫోన్‌, క్యాంటీన్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామని చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి తెలిపారు. ఈ కేసులో ఆరుగురు ఖైదీలు జైలులో ఉన్నారని, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి అనారోగ్యంగా ఉన్నందున జైలు వైద్యాధికారి సూచనల మేరకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ‘చంచల్‌గూడ గేట్‌..తాడేపల్లి రిమోట్‌’ అనే శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రతి రోజూ అనారోగ్యంగా ఉన్న ఖైదీలను ఎంతో మందిని ఆసుపత్రికి తీసుకెళ్లి, తీసుకువస్తుంటామని పేర్కొన్నారు. తెలంగాణ జైళ్లశాఖలో జరిగే శిక్షణకు ఇతర రాష్ట్రాల నుంచి జ్యుడిషియల్‌, పోలీస్‌, జైలు అధికారులు వస్తుంటారని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖ అధికారులు ఇటీవల చంచల్‌గూడ జైలును సందర్శించారని వివరించారు. వారికి జైలు లోపల అతిథి గృహంలో బస ఏర్పాటు చేశామన్నారు. విధి నిర్వహణలో ఎవరి ఒత్తిడికీ లొంగబోమన్నారు. అయితే ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించిన పలు విషయాలకు జైలు అధికారులు ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల అధికారులు వచ్చినప్పుడు సంబంధిత జైలు సూపరింటెండెంట్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఉంటారా? ఉండరా? అనే విషయాన్ని వెల్లడించలేదు. సెలవు రోజైన ఆదివారం నాడే ఏపీ అధికారులు జైలు లోపలికి ఎందుకు వచ్చారు? వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులున్న బ్యారక్‌లోనే గంటల తరబడి ఎందుకు గడిపారు? అక్కడ జరిగిన చర్చల సారాంశం ఏంటి? తెలంగాణ జైళ్లశాఖలో పదోన్నతికి సంబంధించి ఇద్దరు అధికారుల మధ్య వివాదం ఉందా? లేదా? వంటి వాటికి వివరణ ఇవ్వలేదు. కాగా ఏపీ జైళ్ల శాఖ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’ వార్తతో ఉలిక్కిపడ్డారు. జైళ్ల శాఖ అధికారుల వాట్సాప్‌ గ్రూపుల్లో వార్త క్లిప్పింగ్‌ వైరల్‌ అయింది. తాడేపల్లిలో ఉన్న తెలంగాణ జైళ్ల శాఖ అధికారి గురించి ఇలా వచ్చిందేంటని ఆరా తీశారు.


Updated Date - 2023-06-02T04:42:35+05:30 IST