వల్లేపల్లి శశికాంత్‌కు ‘విశిష్ట ఉగాది పురస్కారం’
ABN , First Publish Date - 2023-03-23T03:20:24+05:30 IST
కరోనా సమయంలోనూ, ఆ తర్వాత ‘తానా’ తరఫున విశిష్ట సేవలందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘తానా’ ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ విశిష్ట ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.
ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న కళ్యాణ్ రామ్
చెన్నై, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలోనూ, ఆ తర్వాత ‘తానా’ తరఫున విశిష్ట సేవలందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ‘తానా’ ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ విశిష్ట ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ‘శ్రీ కళాసుధ’ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆళ్వార్‌పేటలోని మ్యూజిక్ అకాడమీలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ.. ‘తన జీవితంలో అందుకున్న తొలి అవార్డు ఇదేనన్నారు. అలాగే సంగీత మొబైల్స్ ఎండీ ఎల్.సుభాష్‌చంద్రకు సైతం విశిష్ట ఉగాది పురస్కారాన్నిప్రదానం చేశారు. సినీరంగం నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం (బింబిసార) అవార్డును నందమూరి కళ్యాణ్ రామ్ అందుకున్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల, హాస్య నటుడు అలీ, ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ తదితరులు హాజరయ్యారు.
నంద్యాల నాకు పునర్జన్మనిచ్చింది: నరసింహన్
ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ ఏపీతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తాను పుట్టింది తమిళనాడులోని కోయంబత్తూరులో అయితే, తనకు పునర్జన్మనిచ్చింది ఏపీలోని నంద్యాల అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాను నంద్యాల ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు.