Share News

భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: రోడ్డు రోలర్ బోల్తా పడి ఇద్దరు మృతి

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:32 AM

విశాఖ భీమిలి బీచ్ రోడ్డులో రోడ్డు రోలర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు సహాయకురాలు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమిలి బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం: రోడ్డు రోలర్ బోల్తా పడి ఇద్దరు మృతి

విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులో జూ పార్కు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రోడ్డు రోలర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. గాజువాక శ్రీనగర్‌కు చెందిన బత్తుల నరసింహారావు (37) రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తాటిచెట్లపాలేనికి చెందిన ఎం.రమణమ్మ (55) అతనికి సహాయకురాలిగా పనిచేస్తోంది. జాలారిపేటలో పనులు ముగించుకుని రుషికొండ వైపు వెళ్తుండగా, జూపార్కు సమీపంలోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోలర్ ఫుట్‌పాత్‌పైకి ఎక్కి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రమణమ్మను పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి కన్నుమూశారు. ఏడీసీపీ శ్రీనివాసరావు, సీఐ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి జేసీబీల సాయంతో రోలర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 06:23 AM