AP Capital Visakhapatnam : విశాఖే రాజధాని
ABN , First Publish Date - 2023-02-01T03:10:10+05:30 IST
‘‘రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని కానున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరికొద్దినెలల్లో నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. ఈ ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా మా రాష్ట్రంలో ..
నేనూ అక్కడికే మకాం మారుస్తా: జగన్
అక్కడ జరిగే సమావేశాలకు రండి
మీ సహచరులనూ తీసుకురండి
దౌత్యవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం
ఏపీ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక భేటీకి హాజరు
చప్పగా సన్నాహక సమ్మిట్!
జగన్ వినతిని పట్టించుకోని వైనం
న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ‘‘రానున్న రోజుల్లో రాష్ట్ర రాజధాని కానున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరికొద్దినెలల్లో నేను కూడా విశాఖకు మకాం మార్చబోతున్నాను. ఈ ఏడాది మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రావడమే కాకుండా మా రాష్ట్రంలో వ్యాపారం చేయడం ఎంత సులభమో విదేశాల్లో ఉన్న మీ సహచరులకు కూడా చెప్పి.. తీసుకురండి’’ అని ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం. మా దగ్గర పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ఇతర రాష్ర్టాల కంటే భిన్నమైనవి. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఏపీ తరఫున కృతజ్ఞతలు. 11.43 శాతం జీఎ్‌సడీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్థి చెందుతోంది. సులభతర వాణిజ్యంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. పరిశ్రమల స్థాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు అందిస్తున్న ఫీడ్ బ్యాక్ వల్లే గత మూడేళ్లుగా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాం. మా రాష్ట్రానికి 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. నాలుగు ప్రాంతాల్లో ఆరు ఓడరేవులు ఇప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. ఏపీలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను కూడా నిర్మిస్తున్నాం’’ అని జగన్ వివరించారు. ఏపీలో 48 రకాల ఖనిజాలు లభ్యమవుతాయని తెలిపారు. ‘‘పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం అనుసరిస్తున్నాం. ఈ క్రమంలో మీకు 21 రోజుల్లోనే అనుమతులు లభిస్తాయి’’ అని జగన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కియా మోటార్స్ ఎండీ-సీఈవో జిన్ పార్క్, టోరె ఇండస్ర్టీస్ ఎండీ-సీఈవో యామా గుచీ, క్యాడ్‌బరీ ఇండియా అధ్యక్షుడు(యూఎ్‌సఏ) దీపక్, ఎవర్టన్ టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ (ఇటలీ) రోషన్ గుణవర్దన, అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ (తైవాన్) డైరెక్టర్ సెర్జియో లీ, సెయింట్ గోబియన్ ఇండస్ర్టీస్ ఇండియా లిమిటెడ్ (ఫ్రాన్స్) తరపున బి.సంతానం, పలు దేశాలకు చెందిన రాయబారులు, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి పాల్గొన్నారు.