Share News

నేడు ‘విజయవాడ ఆకాశవాణి’ అమృతోత్సవ వేడుకలు

ABN , Publish Date - Dec 22 , 2023 | 02:29 AM

కళా నిలయంగా, ప్రసిద్ధ వార్తా ప్రసార కేంద్రంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం అమృతోత్సవ వేడుకలకు

నేడు ‘విజయవాడ ఆకాశవాణి’ అమృతోత్సవ వేడుకలు

విజయవాడ(భవానీపురం), డిసెంబరు 21: కళా నిలయంగా, ప్రసిద్ధ వార్తా ప్రసార కేంద్రంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం అమృతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. 1948 డిసెంబరు 1న ఈ కేంద్రం ఆవిర్భవించింది. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న వేడుకలు నిర్వహిస్తున్నారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో ప్రారంభమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రజాహిత ప్రసార కేంద్రంగా ప్రజలకు విశిష్ట సేవలందిస్తోంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కళా వెంకట్రావు ఈ కేంద్రానికి శ్రీకారం చుట్టారు. సాహితీ, సాంస్కృతిక, నాటక, చలనచిత్ర రంగాలను సుసంపన్నం చేసిన ఎందరో ప్రముఖులను, ప్రతిభావంతులను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక్కడ రూపొందించిన కార్యక్రమాలు జాతీయస్థాయి పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. 1973లో తొలిసారి నాక్‌ జపాన్‌ ప్రైజ్‌ సాధించిందని, 1974 నుంచి 2016 వరకు 50కి పైగా వార్షిక పురస్కారాలను పొందిందని విజయవాడ ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయి వెంపాటి తెలిపారు.

Updated Date - Dec 22 , 2023 | 02:29 AM