పట్టభద్ర స్థానాల్లో హోరాహోరీ

ABN , First Publish Date - 2023-03-17T02:43:59+05:30 IST

రాష్ట్రంలో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గురువారం రాత్రికి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

పట్టభద్ర స్థానాల్లో హోరాహోరీ

రెండుచోట్ల టీడీపీ ముందంజ

నువ్వా నేనా..

ఉత్తరాంధ్రలో దేశం అభ్యర్థి చిరంజీవిరావుకు 4 వేల ఓట్ల మెజారిటీ!

తూర్పు సీమ సీటులోనూ ఆ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌కు 2,400 ఓట్ల ఆధిక్యం

పశ్చిమ సీమలో వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డికి స్వల్ప మెజారిటీ..

2 సీమ టీచర్‌ సీట్లలోనూ ఆధిక్యం

ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకం..

కొనసాగుతున్న కౌంటింగ్‌.. నేడు ఫలితాలు వెలువడే చాన్సు

4 ‘స్థానిక’ ఎమ్మెల్సీలు వైసీపీకే..

శ్రీకాకుళం, పశ్చిమ, కర్నూలుల్లో జయకేతనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గురువారం రాత్రికి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు సీమల్లో టీడీపీ ఆధిక్యం సాధించగా.. పశ్చిమ సీమ స్థానంలో వైసీపీ స్వల్ప మెజారిటీతో ఉంది. అలాగే తూర్పు, పశ్చిమ సీమల్లోని 2 టీచర్‌ స్థానాల్లో పాలక పక్ష అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఈ ఐదు చోట్లా మొదటి ప్రాధాన్య ఓట్లలో నిర్దేశిత శాతం ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు (ఎలిమినేషన్‌) అనివార్యమైంది. శుక్రవారం ఉదయానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తొలి రౌండ్‌లో టీడీపీ ఆధిక్యం సాధించడం సంచలనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అధికారులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.తూర్పు రాయలసీమ (చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం) పట్టభద్రుల నియోజకవర్గంలోనూ తొలి రౌండ్‌ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ 2,400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పశ్చిమరాయలసీమ (అనంతపురం-కడప-కర్నూలు) పట్టభద్రుల స్థానంలో మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 863ఓట్ల స్వల్పఆధిక్యంలో ఉన్నారు.

2 టీచర్‌ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం

తూర్పు రాయలసీమ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు (ఎలిమినేషన్‌) అనివార్యమైంది. గురువారం రాత్రికి నాలుగు రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. వైసీపీ బలపరచిన అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి 10,862 ఓట్లు పోలయ్యాయి. ఆయన గెలవాలంటే ద్వితీయ, తృతీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో మరో 1,284 ఓట్లు కావాలి. పీడీఎఫ్‌ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు పోలవగా.. గెలవాలంటే తదుపరి లెక్కింపులో 3,238 ఓట్లు అవసరం. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 25,271 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయి.. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఏడుగురు అభ్యర్థులను ఎలిమినేట్‌ చేసిన తర్వాత వైసీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 8,953 ఓట్లతో ముందంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివా్‌సరెడ్డి 7,029, పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 4,345 ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. శుక్రవారం తెల్లవారుఝామున ఫలితాలు వెలువడొచ్చని అధికారులు అంటున్నారు.

‘స్థానిక’ విజేతలు వీరే..

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ వైసీపీ దక్కించుకుంది. మొత్తం 1,105 ఓట్లు ఉండగా 1088 పోలయ్యాయి. వీటిలో 25 ఓట్లు చెల్లకుండా పోయాయి. వైసీపీకి 879 ఓటర్లు ఉండగా.. వంకా రవీంద్రనాథ్‌కు 460, కవురు శ్రీనివా్‌సకు 481 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మఽధుసూదన్‌ విజయం సాధించారు.

ఓటమి భయంతో వైసీపీ వర్గీయుల దౌర్జన్యం

అనంతపురం టౌన్‌/విద్య, మార్చి 16: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. తొలిరౌండ్‌లో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డికి దీటుగా టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి ఓట్లు రావడంతో అధికార పార్టీవారిలో గుబులు మొదలైంది. టీడీపీ ఏజెంట్లను భయపెట్టి నోరెత్తకుండా చేసేందుకు వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి తన అనుచరులను కౌంటింగ్‌ కేంద్రం వద్దకు రప్పించారు. వారిలో కొందరు నకిలీ ఐడీలతో కౌంటింగ్‌ హాల్‌లోకి వెళ్లారు. ఏజెంట్ల తరహాలో చొరబడి.. చెల్లని ఓట్లను ప్రశ్నిస్తున్న పులివెందులకు చెందిన టీడీపీ ఏజెంట్‌ ధనుంజయరెడ్డిపై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలవారు తోపులాటకు దిగారు. పోలీసులు దాడికి దిగిన వారిని వదిలిపెట్టి, దెబ్బలు తిన్న ధనుంజయరెడ్డిని బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కౌంటింగ్‌ కేంద్రం సమీపంలో ఉన్న టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, టీడీపీ అభ్యర్థి రామ్‌గోపాల్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వైసీపీ వర్గీయుల దాడిపై తీవ్రంగా మండిపడ్డారు. కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో ఐడీ కార్డులు లేనివారిని పోలీసులు బయటకు పంపించారు.

Updated Date - 2023-03-17T02:43:59+05:30 IST