ఏం చేస్తామో.. చేయలేమో చెప్పేస్తాం!

ABN , First Publish Date - 2023-06-02T04:24:05+05:30 IST

ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర దీర్ఘకాల అపరిష్కృత సమస్యలపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతున్న సర్కారు రూటు మార్చింది. ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటానికి కూడా ససేమిరా అన్న సర్కార్‌ ..

ఏం చేస్తామో.. చేయలేమో చెప్పేస్తాం!

● వారంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో స్పష్టత ఇస్తాం: సీఎస్‌

● పలు అంశాలపై సానుకూలత.. మరికొన్నింట్లో అస్పష్టత

విజయవాడ, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర దీర్ఘకాల అపరిష్కృత సమస్యలపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతున్న సర్కారు రూటు మార్చింది. ఉద్యోగ సంఘాలు కోరినట్టుగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటానికి కూడా ససేమిరా అన్న సర్కార్‌ .. తాజాగా ఏమి చేస్తామో ? ఏమి చేయలేమో? స్పష్టంగా చెప్పేస్తామంటూ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) జవహర్‌ రెడ్డి ద్వారా లీకు ఇచ్చింది. వారం రోజుల్లో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ నిర్వహించి .. ఉద్యోగ సంఘాలన్నింటికీ తాము చేయగలిగినవి, చేయలేనివి స్పష్టత ఇస్తామని సీఎస్‌ పేర్కొన్నారు. గురువారం ఏపీజేఏసీ అమరావతి అగ్రనాయకత్వాన్ని సీఎస్‌ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి చర్చలకు ఆహ్వానించారు. ఏపీజేఏసీ అమరావతి ఇచ్చిన 50 డిమాండ్లపై సీఎస్‌ స్పందించారు. ఉద్యోగులకు సంబంధించి కామన్‌గా ఉన్న ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై వారంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ నిర్వహించి స్పష్టత ఇస్తామని తెలిపారు. ఇందులో డీఏ అరియర్స్‌, పీఆర్‌సీ అరియర్స్‌, ఇతర బకాయిలు, చెల్లింపులు, సీపీఎస్‌ తదితరాలపై స్పష్టత ఇస్తామని సీఎస్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. కొన్నింటిని చేయలేమని కచ్చితంగా చెప్పే అవకాశమూ ఉంది. ఈ జాబితాలో సీపీఎస్‌ మొదటి స్థానంలో ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాల నుంచి 450 ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వీటిలో 330 సమస్యల వరకు పరిష్కరించామని ఏపీజేఏసీ అమరావతి నాయకులకు సీఎస్‌ చెప్పారు. మిగిలిన 120 సమస్యలపై ఏమి చేయగలమో, ఏమి చేయలేమో స్పష్టత ఇచ్చేస్తామని తెలిపారు.

లిఖిత హామీ ఇచ్చే వరకు విరమించేది లేదు..

అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల ప్రధాన ఆర్థికపరమైన అంశాలైన నాలుగు పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ అరియర్స్‌, పే స్కేల్స్‌, స్పెషల్‌ పేలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పబ్లిక్‌ సెక్టార్‌–గురుకులాలు– యూనివర్సిటీల ఉద్యోగులకు 62 ఏళ్ల వర్తింపు, 12వ పీఆర్సీ కమిషనర్‌ నియామకం తదితరాలపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేద ని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు తేల్చిచెప్పారు. సీఎస్‌తో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, శానిటరీ సెక్రటరీలకు పనివేళల్లో స్పష్టత, మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించవద్దని, సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో దివ్యాంగులకు ప్రాధాన్యం, వారి సర్వీసు మేటర్స్‌లో న్యాయం చేయాలన్న డిమాండ్లపై సీఎస్‌ సానుకూలత వ్యక్తం చేశారని ఆమేరకు ఆదేశాలిస్తానని తెలిపారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసే వీఆర్‌ఏలకు డీఏ కోత, వీఆర్‌ఏ నుంచి పదోన్నతులు పొందిన గ్రేడ్‌ – 2 వీఆర్‌ఓలకు పే స్కేల్‌ ఇవ్వాలన్న డిమాండ్లను సీసీఎల్‌ఏ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. ఆర్‌టీసీ(పీటీడీ) ఉద్యోగులకు విలీనం ముందు ప్రమోషన్లు, విద్యార్హతలపై రిలాక్సేషన్‌ వంటి అంశాలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. పోలీసు శాఖలో హోమ్‌గార్డుల సమస్యలు, 1,380 మంది భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టుల మంజురు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అనేక డిమాండ్లకు సీఎస్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ప్రతి నెలా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయా శాఖల హెచ్‌ఓడీలు సమావేశమై సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని సీఎస్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ప్రయోజనకర ఉత్తర్వులన్నీ ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ ఫలితమేనని చెప్పారు. ప్రధానమైన ఆర్థిక సమస్యలపై ఈ నెల 10వ తేదీ లోగా స్పష్టత ఇస్తామని సీఎస్‌ చెప్పారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే స్పష్టతను అధ్యయనం చేసి నాలుగోదశ ఉద్యమానికి వెళతామన్నారు. అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 8న గుంటూరు జిల్లాలో తలపెట్టిన ప్రాంతీయ సదస్సు యతావిధిగా జరుగుతుందన్నారు.

Updated Date - 2023-06-02T04:24:05+05:30 IST