ఇద్దరు వ్యక్తులు.. 130 ఫాం-7లు

ABN , First Publish Date - 2023-09-20T03:08:20+05:30 IST

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, వింత బాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామంలోని రెండు బూత్‌ల పరిధిలో దాదాపు 1,090 ఓట్లున్నాయి.

ఇద్దరు వ్యక్తులు.. 130 ఫాం-7లు

ఆ దరఖాస్తులన్నీ వారం వ్యవధిలోనే సమర్పణ!

బాపట్ల జిల్లా చింతగుంపల గ్రామంలో వెలుగులోకి

బూత్‌లో 397 ఓట్లు.. ఫాం-7లు 205

పర్చూరు మండలం బోడవాడలో బట్టబయలు

బాపట్ల, సెప్టెంబరు19 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, వింత బాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామంలోని రెండు బూత్‌ల పరిధిలో దాదాపు 1,090 ఓట్లున్నాయి. కాగా, ఇద్దరు వ్యక్తులు ఫాం-7లను 130 సమర్పించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని, వారు సమర్పించిన ఫాం7లు మొత్తం టీడీపీ సానుభూతి పరుల ఓట్ల గురించేనని చెబుతున్నారు. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబరు 2 వరకు వారం వ్యవధిలోనే ఈ దరఖాస్తులన్నీ రావడం గమనార్హం. పర్చూరు మండలం బోడవాడలో ఫాం-7లపై తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిపిన పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బూత్‌ నంబర్‌ 109లో మొత్తం 397 ఓట్లుంటే ఫాం-7లు 205 వచ్చాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఫాం-7ల దుర్వినియోగం పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫాం7లు 5కు మించి సమర్పించినవారిని త్రిసభ్యకమిటీ స్వయంగా విచారించాలని ఈసీ ఆదేశించింది. ఉద్దేశ్యపూర్వకంగా దరఖాస్తు చేసినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. దీంతో త్రిసభ్య కమిటీ విచారణకు వచ్చినప్పుడు ఫాం-7లు సమర్పించినవారు ముఖం చాటేస్తుండడం గమనార్హం. పర్చూరు నియోజకవర్గం 5కు మించి ఫాం-7లు సమర్పించినవారు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. వీరిలో 100, 150, 200 ఆక్షేపణలు లేవనెత్తినవారు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కుట్రకు అధికారపార్టీ పాల్పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూరే విధంగా ఓటు విషయంలో ఆక్షేపణ ఎదుర్కొంటున్న వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా నోటీసులు జారీ చేసే ప్రక్రియను గత వారం రోజులుగా వేగవంతం చేశారని తెలుస్తోంది.

Updated Date - 2023-09-20T03:08:20+05:30 IST