విజయనగరం జిల్లాలో రెండు ఆటోలు ఢీ
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:00 AM
రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ చేయి తెగిపోయి రోడ్డు మీద పడింది. మరో వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయాయి.
తెగిపడిన మహిళ చేయి
రేగిడి, డిసెంబరు 25: రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ చేయి తెగిపోయి రోడ్డు మీద పడింది. మరో వ్యక్తికి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రేగిడి మండలం బూరాడ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఆటోలు ఎదురెదురుగా వస్తున్నాయి. మృతదేహం వెంట వెళ్తున్న వారిని తప్పించబోయి రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వావిలపల్లి కళ్యాణి అనే మహిళ చేయి తెగి రోడ్డుపై పడింది. ఈమె ఓ జూట్ పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తోంది. మరో వృద్ధుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వీరిద్దరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మరో ఆరుగురికి గాయాలు కాగా వీరిని 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.