బీచ్ వాక్‌కు.. పోటెత్తిన జనం
ABN , First Publish Date - 2023-08-16T03:11:07+05:30 IST
విశాఖలో చంద్రబాబు పాదయాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం సాయంత్రం నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఆయన చేపట్టిన పాదయాత్రలో వేల మంది పాల్గొన్నారు. ‘జై చంద్రబాబు’, ‘జైజై చంద్రబాబు’, ‘సీఎం సీబీఎన్’ అనే నినాదాలతో హోరెత్తించారు.
బాబు పాదయాత్రలో భారీగా పాల్గొన్న యువత
ఉద్యోగులు, మేధావులు, రైతులు, అభిమానులు కూడా
‘జై బాబు.. సీఎం సీబీఎన్’ నినాదాలతో హోరెత్తిన బీచ్ రోడ్డు
భారీ జాతీయ పతాకం చేబూని ముందుకుసాగిన మాజీ సీఎం
విశాఖలో చంద్రబాబు పాదయాత్రకు నగర వాసులు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం సాయంత్రం నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఆయన చేపట్టిన పాదయాత్రలో వేల మంది పాల్గొన్నారు. ‘జై చంద్రబాబు’, ‘జైజై చంద్రబాబు’, ‘సీఎం సీబీఎన్’ అనే నినాదాలతో హోరెత్తించారు. ‘విజన్-2047’ డాక్యుమెంట్‌ను విడుదల చేసేందుకు ఆయన మంగళవారం సాయంత్రం విశాఖ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముందుగా జాతిపిత గాంధీజీ చిత్రపటానికి, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత 5.31 గంటలకు భారీ జాతీయ పతాకం చేబూని పాదయాత్ర ప్రారంభించారు. అప్పటికే బీచ్ రోడ్డుకు వేలాదిగా చేరుకున్న యువతీయువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, వివిధ వర్గాలు, రంగాలకు చెందిన ప్రముఖులు, రైతులు, నగర వాసులు, తెలుగుదేశం అభిమానులు ఆయన వెంట నడిచారు.
అందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఆయన ముందుకుసాగారు. దారి వెంబడి అనేక ప్రాంతాల్లో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీ పడ్డారు. వారిలో కొందరికి ఆయన అవకాశమిచ్చారు. చిన్నారులతో కలిసి ఫొటోలు దిగారు. ఇక పలువురు బీచ్‌రోడ్డు వెంబడి ఉన్న గోడలపై నిలబడి చంద్రబాబును ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఆసక్తి చూపించారు. జనం భారీగా తరలిరావడంతో రెండున్నర కిలోమీటర్ల యాత్ర పూర్తిచేసేందుకు గంటా ఐదు నిమిషాలు పట్టింది. అనంతరం చంద్రబాబు పార్క్ హోటల్ జంక్షన్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. విజన్ డాక్యుమెంటు విడుదలకు ఎంజీఎం మైదానంలోకి వెళ్లారు. పాదయాత్రలో ఆయన వెంట సీనియర్ నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.
వెలగని లైట్లు..
పాదయాత్ర సమయంలో బీచ్ రోడ్డులోని లైట్లు వెలగలేదు. సాయంత్రం ఆరు గంటలు దాటి చీకటి పడుతున్నప్పటికీ అధికారులు వీధి లైట్లను వేయలేదు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పాలకుల నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమంటూ బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.