గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతు
ABN , First Publish Date - 2023-04-15T03:08:59+05:30 IST
స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.
స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో ఘటన
కె.గంగవరం, ఏప్రిల్ 14: స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సాయి ప్రస్తుతం కాకినాడ జిల్లా కరప మండలం వేళంగిలో ఉంటున్నాడు. శుక్రవారం సాయి పుట్టినరోజు కావడంతో వేళంగి నుంచి అతని మిత్రులు వనుము శివనారాయణ, కొప్పిశెట్టి భవాని శంకర్ (దొరబాబు), కొప్పిశెట్టి గోవిందు, పితాని రాజేంద్ర, పామర్రుకు చెందిన మట్టపర్తి ఆనంద్‌తో కలిసి కూళ్ల గోదావరి ఒడ్డుకు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకుని సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఐదుగురు గోదావరిలో స్నానానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో గోదావరికి పోటు రావడంతో అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగిపోయింది. అతి కష్టం మీద శివనారాయణ, గోవిందు ఒడ్డుకు చేరుకున్నారు. సాయి(24), ఆనంద్(32), రాజేంద్ర(25) గల్లంతయ్యారు.