కల్తీ మద్యం తాగి ముగ్గురు వలస కార్మికుల మృతి
ABN , First Publish Date - 2023-08-22T03:15:49+05:30 IST
రాష్ట్రంలో కల్తీ మద్యం ముగ్గురు వలస కార్మికులను కాటేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో తాజాగా ఈ దారుణం జరిగింది.
అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా), ఆగస్టు 21: రాష్ట్రంలో కల్తీ మద్యం ముగ్గురు వలస కార్మికులను కాటేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో తాజాగా ఈ దారుణం జరిగింది. అచ్యుతాపురం సెజ్‌లోని కర్మాగారాల్లో పనిచేసేందుకు ఈనెల 15న ఒడిశా నుంచి కొందరు కూలీలు దుప్పితూరు వచ్చారు. ఆ రోజు రాత్రి వీరిలో కొందరు మద్యం సేవించారు. అందులో కోరాపుట్ జిల్లా దశమంతపూర్ మండలం ముర్‌కర్ గ్రామానికి చెందిన జాగా మినియక్ (45) మరుసటి రోజు వాంతులు, విరోచనాలు కావడంతో కాంట్రాక్టర్ ఇచ్చిన మందులు వేసుకొని పడుకున్నాడు. సాయంత్రం తోటి కూలీలు గమనించగా చనిపోయాడు. అతనితో మద్యం సేవించిన బలంగీర్ జిల్లా టిట్లాగర్ మండలం సింగర ముండ గ్రామానికి చెందిన సురేందర్ కార్సెల్ (38), నవరంగపూర్ జిల్లా చిట్టబేడ మండలం చలన్‌గూడ గ్రామానికి చెందిన పద్మన్ సాంత (26) కూడా పదహారో తేదీప వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో కాంట్రాక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సురేందర్ కేజీహెచ్ నుంచి ఎవరికీ చెప్పకుండా మిత్రులతో రైలులో స్వస్థలానికి బయలుదేరి మార్గమధ్యంలో చనిపోయాడు. పద్మన్ కేజీహెచ్‌లోనే ఈనెల 19న మరణించాడు. ఈ విషయం ఒడిశా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడంతో అక్కడి వైద్య శాఖ అధికారులు ఏపీ వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎంహెచ్‌వో అచ్యుతాపురం వైద్యుల బృందాన్ని దుప్పితూరుకు పంపించారు. కల్తీ మద్యం వల్లే ముగ్గురూ చనిపోయినట్టు బృందం నివేదిక ఇచ్చింది. దుప్పితూరులో షెడ్ల చుట్టూ బ్లీచింగ్ చల్లి శుభ్రం చేయించారు. నీటి నమూనాలు పరీక్షలకు పంపారు.