కొండంత నష్టానికి.. కొసరంత సాయం!

ABN , First Publish Date - 2023-06-02T04:34:15+05:30 IST

వరుస విపత్తులతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం

కొండంత నష్టానికి.. కొసరంత సాయం!

● అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అరకొర సాయం

● ఇటీవల నష్టపోయిన రైతులకు ఇచ్చింది 53.62 కోట్లు

(అమరావతి–ఆంధ్రజ్యోతి)

వరుస విపత్తులతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయినా రైతాంగానికి తగిన పరిహారం లభించడం లేదు. కొండంత నష్టానికి.. కొసరంత సాయమే అందుతోంది. జగన్‌ ప్రభుత్వం ఏటా రూ.2వేల కోట్లు చొప్పున బడ్జెట్‌లో కేటాయిస్తున్నా.. నాలుగేళ్లలో కూడా బాధిత రైతులకు రూ.2వేల కోట్లు పంచలేదు. వాస్తవంగా 2019 జూన్‌ నుంచి గత (మే) నెల వరకు తుఫాన్లు, అకాల వర్షాలు, అధిక వర్షాలు, వరదలతో లక్షలాది మంది రైతులు కొన్ని వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కోల్పోయారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. కానీ.. సీఎం జగన్‌ గురువారం పత్తికొండలో విడుదల చేసిన రూ.53.62 కోట్లతో కలిపి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1,965 కోట్లు మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సిడీని పంపిణీ చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోతేనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ఇంతకంటే తక్కువ నష్టపోయిన రైతులకు సాయం అందడం లేదు. నిజానికి ఏ పంట అయినా.. 10 శాతం కంటే ఎక్కువ దెబ్బతింటే, పెట్టుబడులకు నష్టమే వస్తుందని రైతులు చెబుతున్నారు. అయినా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించడం లేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 76 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 48 వేల మంది రైతులకు రూ.44.19 కోట్లు జగన్‌ పత్తికొండలో విడుదల చేశారు. వాస్తవంగా ఒక్క మార్చి నెలలోనే 59 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందని అధికారులు ప్రకటించారు. వాస్తవంగా మార్చిలో 2 లక్షల ఎకరాలు, ఏప్రిల్‌, మే నెలల్లో మరో 2లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు అంచనా వేశారు. తడిసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేపట్టినా.. తడిసిన మిర్చిని ప్రభుత్వం, వ్యాపారులు కొనుగోలు చేయట్లేదు. రైతులే ఏదోకరంగా తిప్పలు పడి, వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. పంట కోశాక నష్టపోయిన జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్లు ప్రభుత్వం విదిలించింది. దెబ్బతిన్న వరి రైతులకు మద్దతు ధర దక్కకపోగా.. తేమ, నూకశాతం పేరటి తూకంలో కోత పెట్టారు.

Updated Date - 2023-06-02T04:34:15+05:30 IST