Share News

ఇది పీకే సలహా.. జగన్‌ వింటారా?

ABN , First Publish Date - 2023-10-30T02:44:06+05:30 IST

ఎన్నికల ముందు కులాల చుట్టూ వ్యూహాలు పన్ని, లేనిది ఉన్నట్లు ప్రచారం చేసి, సీమాంధ్ర ప్రజల మనసులో విష బీజాలు నాటిన వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)...

ఇది పీకే సలహా.. జగన్‌ వింటారా?

సంపద సృష్టించే సంక్షేమానికి ఖర్చు చేయాలి: పీకే కొత్త హితోక్తులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎన్నికల ముందు కులాల చుట్టూ వ్యూహాలు పన్ని, లేనిది ఉన్నట్లు ప్రచారం చేసి, సీమాంధ్ర ప్రజల మనసులో విష బీజాలు నాటిన వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)... ఇప్పుడు సూక్తులు, హితోక్తులు పలుకుతున్నారు. సంక్షేమం అవసరమేకానీ... సంపద సృష్టించి, దానిలో నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్‌ కిశోర్‌... బిహార్‌లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పలు నగరాల్లో పర్యటిస్తూ శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమంలో... ఏపీలో అభివృద్ధిని మూలకు పడేసి, సంక్షేమం పేరుతో జరుగుతున్న హంగామాపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిందే. అవి లేకుంటే మనం సమాజానికి అన్యాయం చేసినట్లవుతుంది. అయితే... సంపద సృష్టించి అందులో నుంచి కొంత పంపిణీ చేయాలి. సమాజంలో సంపద పెరిగే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించా లి. అప్పుడే మన భావితరాలకు మేలు జరుగుతుంది’’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. మరి... జగన్‌ సర్కారుకు ఆయన ఈ మాట చెప్పారో లేదో తెలియదు! ప్రశాంత్‌ కిశోర్‌ చెబుతున్న ‘సంపద పెరిగే వాతావరణం’ జగన్‌ హయాంలో అంతరించి పోయింది. పాత పథకాలకే పేర్లు మార్చి, అమలు తీరు మార్చి బటన్‌ నొక్కడమొక్కటే మిగిలింది. అభివృద్ధి లేదు. అప్పులు పుట్టకుంటే ‘బటన్‌’ పని చేయదు. ‘అమ్మ ఒడి’ సహా పలు కీలక పథకాలను మద్యం ఆదాయంతోనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ‘సంక్షేమం’ పేరుతో అనుచితమైన ఉచితాలకు తెరలేపింది ప్రశాంత్‌ కిశోర్‌ సలహాల మేరకే! ఎలాగైనా అధికారంలోకి రావాలని, రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని, ఓట్లు రాలడమే ముఖ్యమని ప్రశాంత్‌ కిశోర్‌ నాడు చెప్పారు.

Updated Date - 2023-10-30T02:44:06+05:30 IST