Share News

వేతనాలు పెంచేందుకు ఇది సమయం కాదు

ABN , Publish Date - Dec 22 , 2023 | 02:38 AM

అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమేనని, గౌరవ వేతనాల పెంపుదలకు మాత్రం ఇది సమయం కాదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ

వేతనాలు పెంచేందుకు ఇది సమయం కాదు

డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమే

అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలి

ఇతర డిమాండ్లు పరిష్కారం: మంత్రి ఉషశ్రీ

అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమేనని, గౌరవ వేతనాల పెంపుదలకు మాత్రం ఇది సమయం కాదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల వేతనాలు పెంచుతామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10,500 వేతనం ఉండగా.. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏపీలో రూ.వెయ్యి పెంచారని తెలిపారు. అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఇతర డిమాండ్లు పరిష్కరిస్తూ జీవోలు ఇచ్చామన్నారు. బాలింతలు, గర్బిణీలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. వేతనాలు పెంచడానికి ఇదెందుకు సమయం కాదని మీడియా ప్రశ్నించగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, తగిన సమయంలో స్పందిస్తామని, ఇప్పుడు మాత్రం సమయం కాదని బదులిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు దిగితే వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కేంద్రాల తాళాలు ఎందుకు పగలకొట్టించారని ప్రశ్నించగా.. ప్రభుత్వం తాళాలు పగలకొట్టాలని చెప్పలేదన్నారు. తాళాలు పగలకొట్టిన వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా.. అవన్నీ జిల్లా కలెక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు.

టికెట్‌ కోసం జగన్‌తో భేటీ కాలేదు

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ విషయంపై తాను సీఎం జగన్‌తో సమావేశం కాలేదని మంత్రి ఉషశ్రీ చరణ్‌ చెప్పారు. ఈ సారి టికెట్‌ విషయంలో జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. కళ్యాణదుర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 02:38 AM