Share News

ఇది వైసీపీకి, ఆంధ్రులకు మధ్య యుద్ధం

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:02 AM

టీడీపీ యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు భారీసభ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కోర్రతు బంగార్రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న యువగళం ముగింపు సభావేదిక ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

ఇది వైసీపీకి, ఆంధ్రులకు మధ్య యుద్ధం

యువగళంతో అన్ని వర్గాల్లో పెరిగిన ఆత్మస్థైర్యం

సభకు ఆరు లక్షల మంది వస్తారని అంచనా

వేదికపై 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాం: అచ్చెన్న

శ్రీకాకుళం (ఆంధ్రజ్యోతి), భోగాపురం, డిసెంబరు 17: టీడీపీ యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు భారీసభ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కోర్రతు బంగార్రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న యువగళం ముగింపు సభావేదిక ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘లోకేశ్‌ యువగళం పాదయాత్ర రాష్ట్రంలో యువతకు, అన్ని వర్గాల ప్రజానీకానికి ఆత్మస్థైర్యాన్ని, టీడీపీపై మరింత నమ్మకాన్ని ఇచ్చింది. యువగళం ముగింపు సభను ఈ నెల 20న మధ్యాహ్నం 2గంటలకు నిర్వహిస్తున్నాం. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా జనాలు రావడానికి తహతహలాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది వైసీపీకి, రాజకీయ పార్టీలకు కాదు... వైసీపీకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి. ఆ యుద్ధంలో ప్రధాన భూమిక టీడీపీది. తోడుగా జనసేన పార్టీ. ఈ రెండు పార్టీల వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. యువగళం ముగింపు సభకు ఆరు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. సభకు వచ్చే వారికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సభా ప్రాంగణం 19 తేదీ నాటికి సిద్ధమవుతుంది. 2024 ఎన్నికల సమరానికి టీడీపీ, జనసేన సిద్ధమని, శంఖారావాన్ని పూరిస్తాం.

సభ సక్రమంగా జరగకుండా చేసేందుకు ప్రభుత్వం తీవ్ర ఆటంకాలు కలిగిస్తుంది. ప్రభుత్వం ఎంత అడ్డు తగిలితే ప్రజలు సభకు వచ్చేందుకు అంత ఉత్సాహం చూపుతున్నారు. ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, చివరికి నడిచి అయినా వచ్చి ముగింపు సభను విజయవంతం చేయాలి’’ అని అచ్చెన్న అన్నారు. సభా ఏర్పాట్లను పరిశీలించి కొన్ని మార్పులు, చేర్పులను నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ఆలపాటి రాజేంద్రప్రసాదు, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు శ్రీకాకుళంలో పార్టీ శ్రేణులతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘‘వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉంది. ఆ పార్టీ నుంచి చాలామంది టీడీపీలో చేరేందుకు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ‘ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చేస్తాం.. ఒక్కరికి సీటు ఇవ్వండి చాలు’ అని ఆఫర్లు ఇస్తున్నారు. రేపటి ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు. టీడీపీకి కచ్చితంగా 160 సీట్లని నే చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా’’ అని అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:02 AM