పిస్టల్ గురిపెట్టి చంపేస్తామన్నారు!
ABN , First Publish Date - 2023-12-03T03:20:22+05:30 IST
సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు
మీడియా చొరవతో బతికిపోయా
ఎస్పీ గారూ.. మీరు కాణిపాకంలో
ప్రమాణం చేస్తే రాజకీయాలు వదిలేస్తా
జగన్ రెడ్డీ.. నేనేమన్నా అనాథనా?
నాకు తమ్ముళ్లు, కొడుకు ఉన్నారు
నీకెవరున్నారు.. ఉన్న బాబాయినీ చంపేసుకున్నావ్
పోలీసులను అడ్డుపెట్టుకుని కిడ్నా్‌పలు చేస్తావా?
రాజారెడ్డి గుండెపోటుతో చనిపోలేదు.. హత్య చేశారు
సీఎం జగన్‌పై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు
కడప, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తనను చంపేయాలని అనుకున్నారని, కణతిన పిస్టల్ పెట్టి కాల్చేస్తామని బెదిరించారని చెప్పారు. అయితే, మీడియా చొరవతో తాను బతికిపోయానని తెలిపారు. సుమారు 10 నెలల కిందట నమోదైన ఓ కేసులో బీటెక్ రవిని గత నెల 14న పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. మూడు రోజుల కిందట ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కడపలోని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన అరెస్టు, దీనికి ముందు జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. ‘‘నన్ను పోలీసులు ఈ నెల 14న అరెస్టు చేసి తీసుకెళ్లారు. రెండున్నర నుంచి మూడు గంటల పాటు కణతిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పిస్టల్ పెట్టి ‘నువ్వు నిజం చెప్పు.. నిన్ను చంపేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి’ అంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. నేనేమన్నా అనాథనా? నాకు ఇద్దరు తమ్ముళ్లు, బాబాయి, మా అబ్బాయి ఉన్నారు. జగన్ తాత రాజారెడ్డి హార్ట్‌ఎటాక్ వచ్చి చనిపోలేదు. హత్య చేశారు కాబట్టే చచ్చిపోయారు. జగన్.. నువ్వు నీ బాబాయిని చంపేసుకున్నావ్. వైఎస్ కుటుంబం పెద్దదని అంటారు కదా.. మీ వాళ్లనే ఐదారు మందిని పంపి బీటెక్ రవిని చంపమని మొగోడిలా చెప్పు. లేదంటే లక్ష కోట్లు సంపాదించుకున్నావు కదా, కిరాయివాళ్లకు దాంట్లో పది కోట్లు ఇచ్చి ఏదైనా చేయించు. అంతేకానీ, పోలీసులను అడ్డుపెట్టుకుని కిడ్నా్‌పలు చేయిస్తావా. ఇలాంటి పనులను పులివెందులలో గాండు నాకొ..కుల పని అంటారు’’ అని మండిపడ్దారు. నవంబరు 14న తనను అరెస్టు చేయడానికి ముందు జరిగింది హత్యాయత్నమేనని బీటెక్ రవి తెలిపారు. ‘‘వాస్తవానికి చంద్రబాబు అరెస్టు అయినప్పుడు దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశాం. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇదే ఎస్పీని వెళ్లి కలిశాం. అప్పుడు నేను కూడా ఉన్నా. కానీ, నేను కనిపించడం లేదని పోలీసులు అబద్ధాలు చెబుతున్నారు’’ అని చెప్పారు.
ఆయన సీఐ కాదు.. ఎస్పీ!
జిల్లాలో టెక్నికల్‌గా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉన్నా.. అఫిషియల్‌గా సీఐ అశోక్‌రెడ్డి ఎస్పీగా సర్వాధికారిగా వ్యవహరిస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఆ రోజు నేను అందుబాటులో లేనన్న విషయంపై ఎస్పీ కౌశల్ కాణిపాకం వినాయకస్వామి వద్ద ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘నన్ను స్టేషన్‌లో అప్పగించే ముందు సీఐ రామకృష్ణారెడ్డి నాకు బేడీలు తీసి, ముసుగు తొలగించారు. ఆ సీఐ రామకృష్ణారెడ్డి కానీ, అశోక్‌రెడ్డి కానీ.. 6.30కు అరెస్టు చేసి డైరెక్టుగా ఎక్కడా ఏమీ చేయకుండా నన్ను వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని కాణిపాకం వద్ద ప్రమాణం చేయమనండి’’ అని అన్నారు. అలా ప్రమాణం చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు.
మేజిస్ట్రేట్ వద్దన్నా
‘‘వల్లూరు స్టేషన్ నుంచి రాత్రి 11.30కి నన్ను మేజిస్ర్టేట్ వద్దకు తీసుకుపోతే ఆయన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు పత్రం చూసి విసుక్కున్నారు. 24 గంటలు టైం ఉంది కదా.. రేపు కోర్టుకు తేవచ్చు కదా.. ఏమంత ఎమర్జన్సీ కేసు. ఇమ్మీడియట్‌గా రెగ్యులర్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అని మేజిస్ర్టేట్ చెప్పారు. అయినప్పటికీ మేజిస్ర్టేట్‌ను రిక్వెస్ట్ చేసి రిమాండ్‌కు తీసుకుపోయారు. మీ విధులు మీరు నిర్వర్తించకుండా వ్యక్తిగతంగా పైవాళ్లు చెప్పారని చేస్తే.. మేం కూడా వ్యక్తిగతంగానే చేస్తాం. మీరు పాతాళలోకంలో ఉన్నా కూడా మేం విడిచిపెట్టం’’ అని రవి హెచ్చరించారు. రెండున్నర.. మూడు గంటల సేపు పాయింట్ బ్లాంక్‌లో కణతికి పిస్టల్ ఆనించి అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిపారు. సీఐ రామకృష్ణారెడ్డి మరింతగా బెదిరించారని చెప్పారు. ‘‘నువ్వు సమాధానం చెప్పకుంటే షూట్ చేయమని ఆర్డర్లు ఉన్నాయి’’ అని బెదిరించినట్టు చెప్పారు.