గడువు తీరినా తవ్వేస్తున్నాయి
ABN , First Publish Date - 2023-12-03T03:23:47+05:30 IST
ఇసుక తవ్వకాలకు ఈ ఏడాది మే 2వ తేదీతో ఒప్పంద గడువు ముగిసినప్పటికీ జయప్రకాశ్ వెంచర్స్ (జేపీ), టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నాయని,
జేపీ, టర్న్‌కీ అక్రమ తవ్వకాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇసుక తవ్వకాలకు ఈ ఏడాది మే 2వ తేదీతో ఒప్పంద గడువు ముగిసినప్పటికీ జయప్రకాశ్ వెంచర్స్ (జేపీ), టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నాయని, వాటిని అడ్డుకొనేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ మైనింగ్ వల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని ఈ సంస్థల నుంచి వసూలు చేసేలా అధికారులను ఆదేశించాలని ఆ వ్యాజ్యంలో కోరారు. గుంటూరుజిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన దండా నాగేంద్ర కుమార్ ఈ పిల్ దాఖలు చేశారు. యంత్రాలతో ఇసుకను తవ్వి భారీ వాహనాల ద్వారా తరలించేందుకు వీలుగా నదీ ప్రవాహానికి అడ్డంగా జరిపిన బండ్‌లు నిర్మాణం, నిబంధనలు అతిక్రమించి జరుపుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేయాలని కోరారు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ, మైనింగ్ శాఖ, ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్‌కు చెందిన నిపుణులను కమిటీలో సభ్యులుగా చేర్చాలని అభ్యర్ధించారు. రాష్ట్రంలోని వివిధ రీచ్‌లలో ఇసుక తవ్వకం, నిల్వ, రవాణా నిమిత్తం ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా తాజాగా మైనింగ్‌శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఈ-టెండర్ నోటిఫికేషన్, దాని ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని కోరారు. వ్యాజ్యం పై విచారణ ముగిసేవరకు రాష్ట్రంలోని అన్ని రీచ్‌లలో జయప్రకాశ్ పవర్ వెంఛర్స్, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు జరుపుతున్న ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్, పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ జాయింట్ డైరెక్టర్, మైనింగ్‌శాఖ డైరెక్టర్, మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ, స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల మైనింగ్ అధికారులు, కలెక్టర్లు, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సీఎండీ, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ బి.శ్రీనివాసరెడ్డితో సహా మొత్తం 65మందిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. వ్యాజ్యంపై విచారణ ముగిసేవరకు రాష్ట్రంలోని అన్ని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.