TarakaRatna: తారకరత్న గుండెకు స్టంట్స్‌ వేయలేకపోవడానికి కారణాలివే..!

ABN , First Publish Date - 2023-01-27T21:44:51+05:30 IST

నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం పట్టణం

TarakaRatna: తారకరత్న గుండెకు స్టంట్స్‌ వేయలేకపోవడానికి కారణాలివే..!

కుప్పం: నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం పట్టణం (Kuppam town) లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకు తరలించారు. నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) తదితర ప్రముఖులు పీఈఎస్‌కు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, మెరుగైన వైద్యం అందించాలని పీఈఎస్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ప్రముఖ సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR), తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఓ దశలో తారకరత్నకు పల్స్‌ పూర్తిగా పడిపోయిందనే వదంతులు స్థానికంగా వచ్చాయి.

కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తారకరత్న గుండెలో బ్లాక్స్‌ అధికంగా ఉన్నాయి. స్టంట్‌ వేయాలంటే షుగర్‌ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోవడం లేదు. దీంతో షుగర్‌ లెవల్‌ 400గా ఉంది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్‌ వేయలేకపోయారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ఎయిర్‌ అంబులెన్సులో తరలిద్దామని ప్రయత్నిస్తే, సౌత్‌ ఇండియాలో ఎక్కడా దొరకలేదు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని శుక్రవారం మధ్యాహ్నం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ వద్ద నందమూరి బాలకృష్ణ వివరించారు. ‘ప్రస్తుతం తారకరత్నకు బీపీ 120/80 చూపిస్తోంది. గుండెలో ఎడమ వైపు 90 శాతం బ్లాక్‌ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయి. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వివరించారు. కాగా, అందరి ఆశీస్సులతో అన్నయ్య ఆరోగ్యం బాగుందని తారకరత్న టీమ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, బెంగళూరుకు తరలించేందుకు సాయంత్రానికి రెండు అంబులెన్సులను సిద్ధం చేశారు. పీఈఎస్‌ మీదుగా పాదయాత్రగా వచ్చిన నారా లోకేశ్‌ ఆస్పత్రిలోకి వెళ్లారు. తారకరత్న ఆరోగ్యం విషయమై వైద్యులతో మాట్లాడారు. రాత్రి 9 గంటల వరకు కూడా బెంగళూరుకు తరలించే విషయమై కుటుంబీకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - 2023-01-27T21:44:52+05:30 IST