Share News

కోడి కత్తి’ దాడిలో కుట్ర కోణం లేదు

ABN , First Publish Date - 2023-11-29T04:00:19+05:30 IST

విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు తప్ప, ఇతర వ్యక్తులు, పార్టీలకు ఏ పాత్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హైకోర్టుకు నివేదించింది.

కోడి కత్తి’ దాడిలో కుట్ర కోణం లేదు

‘కోడి కత్తి’ దాడిలో కుట్ర కోణం లేదు

శ్రీనివాసరావుకు తప్ప ఇతర వ్యక్తులు, పార్టీలకు పాత్ర లేదు

లోతైన విచారణ కోరుతూ జగన్‌ వేసిన పిటిషన్‌ను

కొట్టివేయండి.. హైకోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్‌

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు తప్ప, ఇతర వ్యక్తులు, పార్టీలకు ఏ పాత్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హైకోర్టుకు నివేదించింది. దీనిలో ఎలాంటి తేల్చిచెప్పింది. ఘటనపై లోతైన విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. లోతైన దర్యాప్తునకు ఆదేశించేందుకు నిరాకరిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై డివిజన్‌ బెంచ్‌ మాత్రమే విచారణ జరపాలని తెలిపింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేసింది. సీఎం జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొంది. ప్రస్తుత పిటిషన్‌ డివిజన్‌ బెంచ్‌ ముందు విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరుతూ.. ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ బీవీ శశిరేఖ తాజాగా కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కుట్రకోణంపై లోతైన విచారణ జరిపేలా ఆదేశించాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి.. విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేశారు. జగన్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఎన్‌ఐఏ, జె.శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది.

లోతుగా విచారించాం..

‘కేసులో లోతైన దర్యాప్తు నిర్వహించాం. జగన్‌తో పాటు పలువురు సాక్షులను విచారించాం. నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌.. టీడీపీ మద్దతుదారుడైన హర్షవర్ధన్‌ ప్రసాద్‌కు చెందినదని జగన్‌ చెప్పారు. ఘటనలో కుట్రకోణాన్ని తేల్చేందుకు హర్షవర్ధన్‌ను ప్రశ్నించాం. టీడీపీలో క్రియాశీల సభ్యుడినని ఆయన చెప్పారు. శ్రీనివాసరావు నియామకం గురించి వివరించారు. దాడి ఘటనలో హర్షవర్ధన్‌ పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. దర్యాప్తులో భాగంగా నిందితుడి స్వస్థలానికి వెళ్లాం. శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలింది. చార్జిషీటు దాఖలు చేసిన అనంతరం కేసులో విస్తృత కుట్రకోణం తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించాం. దర్యాప్తులో భాగంగా నిందితుడు, అతడి సహ ఉద్యోగుల ఫోన్లలో సమాచారాన్ని వెలికితీసి పరిశీలించాం. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజ్‌ను సమగ్రంగా విశ్లేషించాం. ఎన్‌ఐఏ జరపిన సమగ్ర దర్యాప్తులో ఈ రోజు వరకు ఎలాంటి కుట్ర కోణం బయటపడలేదు. దాడి ఘటనలో శ్రీనివాసరావు మినహా ఇతర వ్యక్తులు, రాజకీయ పార్టీల పాత్ర లేదు.

ఘటనపై లోతైన విచారణ జరిపించాలని జగన్‌ వేసిన అనుబంధ పిటిషన్‌పై పూర్తిస్థాయి వాదనలు విన్నాకే.. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చుతూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఈ ఏడాది జూలై 25న ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్‌ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. విచారణ పరిధిపై ఇప్పుడు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఎన్‌ఐఏ కోర్టుల విచారణ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఈ ఏడాది జూలై 24న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతకు ముందే పిటిషనర్‌ వేసిన అనుబంధ పిటిషన్‌పై వాదనలు విని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపధ్యంలో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు విచారణ పరిధి లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎన్‌ఐఏ యాక్ట్‌లోని సెక్షన్‌ 21 ప్రకారం ఎన్‌ఐఏ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై కేవలం ధర్మాసనం(డివిజన్‌ బెంచ్‌) వద్దే అప్పీల్‌ దాఖలు చేసుకోవాలి. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదు. ప్రస్తుత కేసులో ట్రయల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయండి. పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌ ముందు ఉంచేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కౌంటర్‌లో ఎన్‌ఐఏ కోరింది.

Updated Date - 2023-11-29T04:00:34+05:30 IST