Share News

వైసీపీ పాలన అవినీతిమయం

ABN , First Publish Date - 2023-11-26T02:52:58+05:30 IST

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అంతా అవినీతిమయమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.

వైసీపీ పాలన అవినీతిమయం

400కు పైగా మండలాల్లో కరువు

100 మండలాలను మాత్రమే గుర్తించారు

కేంద్రం రైల్వే జోన్‌ మంజూరు చేసినా

రాష్ట్రం స్థలం కేటాయించలేదు: పురందేశ్వరి

అనకాపల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అంతా అవినీతిమయమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. పార్టీ సంస్థాగత అంశాలపై సమీక్షించేందుకు శనివారం ఇక్కడకు వచ్చిన ఆమె పెంటకోట కన్వెన్షన్‌ హాలులో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రతి పథకంలోనూ కేంద్రం అందిస్తున్న నిధులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు 152 సీట్లు ఇచ్చినప్పటికీ సీఎంగా జగన్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. ఎన్నికల ప్రచారంలో రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తానని చెప్పిన జగన్‌ కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలతో కలిపి రూ.13,500 కు బటన్‌ నొక్కుతున్నారు. రాష్ట్రంలో 400కు పైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కానీ, కేవలం 100 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. కరువు తీవ్రతపై కనీసం మంత్రిమండలి సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం కనీసం భూమి కేటాయించలేకపోయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే... వాటిలో కనీసం 20 శాతం కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయలేదు. కేంద్రం నిధులు రూ.7 కోట్లతో బొజ్జన్న కొండను, రూ.17 కోట్లతో అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నాం’’ అని పురందేశ్వరి తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్‌ కాశీవిశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T02:53:13+05:30 IST