గడిపింది గంటన్నరే.. కడపకు రోజంతా నరకం
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:35 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన అంటే సొంత జిల్లావాసులే బెంబేలెత్తిపోతున్నారు. కడపలో జగన్ ప్రారంభించడానికి వీలుగా కొన్ని రోడ్లు, సర్కిళ్ల
పలు కార్యక్రమాలకు జగన్.. సీఎం కోసం ఆర్టీసీ బస్సులకు బ్రేక్
ప్రయాణికులకు ఇక్కట్లు.. స్థానికులకు జగన్ మార్క్ సినిమా
జగన్ వ్యతిరేక నిరసనలపై ఉక్కుపాదం.. అంగన్వాడీల నిర్బంధం
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, సెంచురీ ప్లై ఇండస్ర్టీల ప్రారంభం
కడప, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన అంటే సొంత జిల్లావాసులే బెంబేలెత్తిపోతున్నారు. కడపలో జగన్ ప్రారంభించడానికి వీలుగా కొన్ని రోడ్లు, సర్కిళ్ల పునరుద్ధరణ పనులు గత 20 రోజులుగా ముమ్మరంగా సాగాయి. వాటి కోసం ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఒక ఎత్తయితే, జగన్ కడప పర్యటన మరో ఎత్తు. కడప నగరంలో శనివారం సాయంత్రం సీఎం పర్యటించారు. కానీ, ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులను నిలిపివేసి జనానికి జగన్ మార్కు సినిమా చూపించారు. ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ సెలవు నిమిత్తం సాఫ్ట్‌వేర్లు, పండగకు వెళ్లేవారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జగన్ కడప నగరంలో గంటన్నరసేపు పర్యటించారు. పదేళ్ల క్రితం నిర్మించిన కలెక్టరేట్‌ను సుమారు రూ.6కోట్లు ఖర్చుపెట్టి పునరుద్ధరించారు. ఆ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత 4.37గంటలకు ఆర్టీసీ బస్టాండులోని అంబేడ్కర్ సర్కిల్‌కు వచ్చారు. ఇక్కడ 20నిమిషాలు ఉండి కోటిరెడ్డిసర్కిల్, సెవెన్‌రోడ్స్ సర్కిల్ ప్రారంభించారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందుల వెళ్లారు. మొత్తం కలిపి కడప నగరంలో జగన్ పర్యటన గంటన్నర మాత్రమే. అయితే జనాలకు మాత్రం 70 ఎంఎం సినిమా చూపించారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో అన్ని సర్కిళ్లను బంద్ చేసి జనాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేశారు.
అంగన్వాడీలపై అణచివేత
ఇచ్చిన హమీలు అమలు చేయాలని కోరుతూ పులివెందులలో సమ్మె బాట పట్టిన అంగన్వాడీలను భయపెట్టి నాలుగురోజుల క్రితమే శిబిరాన్ని ఖాళీ చేయించారు. కడపలో దీక్షలు చేస్తున్న కార్యకర్తలను బయటికి రానివ్వకుండా పోలీసులు నిర్బంధించారు. కడప జిల్లా సమగ్రాభివృద్ధిని విస్మరించిన జగన్ పర్యటనతో ఒరిగేదేమీ లేదంటూ అఖిలపక్ష నేతలు గాలిచంద్ర, హరిప్రసాద్, చంద్రశేఖర్, సత్తార్, ప్రసాద్ తదితరులు ప్రెస్‌క్లబ్ నుంచి ర్యాలీ నిర్వహిస్తుండగా అరెస్టు చేశారు. కమలాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ టీడీపీ నేత సాయినాథ్ శర్మ... రైతులతో కలిసి సీఎంకు వినతిపత్రం ఇవ్వడానికి విమానాశ్రయం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించగా అడ్డుకుని నిర్బంధించారు.
మెడికల్ హబ్‌గా కడప : జగన్
రాయలసీమ జిల్లాలకు కడప మెడికల్ హబ్‌గా మారనుందని సీఎం జగన్ అన్నారు. కడప నగర శివారులోని రిమ్స్ వద్ద నిర్మించిన వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ, మెంటల్ హెల్త్ కేర్, క్యాన్సర్ సెంటరు, ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి భవనాలను ఆయన ప్రారంభించారు. ఆధునికీకరించిన కలెక్టరేట్ భవనాన్ని జగన్ ప్రారంభించిన అనంతరం 50మంది దివ్యాంగులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అందించారు. అలాగే అగ్నిమాపక రిస్కు పరికరాలను ప్రారంభించారు. అనంతరం బస్టాండు దగ్గర అంబేడ్కర్ సర్కిల్ నుంచి వె..ౖజంక్షన్ వరకు రూ.56.70కోట్లతో నిర్మించిన రోడ్డు, కోటిరెడ్డి సర్కిల్‌ను ప్రారంభించారు. గోపవరం మండలంలో రూ.956.00కోట్ల మేర పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న సెంచురీ ప్లై ఇండస్ర్టీని సీఎం ప్రారంభించారు. కడపలో చేపట్టిన అభివృద్ధి పనులు, సెంచురీ ప్లై ఇండస్ర్టీ నిర్మాణ పనులు ఇంకా పూర్తిస్థాయిలో కాకపోవడం కొసమెరుపు.