సంక్షేమ జెండా, అజెండా మనదే!

ABN , First Publish Date - 2023-05-27T03:47:20+05:30 IST

‘‘సంక్షేమం జెండా, అజెండా మనదే. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో.. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. దేశానికి చూపిస్తాం’’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

సంక్షేమ జెండా, అజెండా మనదే!

అది ఎలా ఉంటుందో చూపిస్తాం

వివేకా హత్యలో జగన్‌ పాత్ర తేలుతోంది

పార్లమెంట్‌ను మోదీ ప్రారంభిస్తే తప్పులేదు

పొలిట్‌బ్యూరో భేటీలో బాబు వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణపై సమావేశంలో చర్చ

అమరావతి/రాజమహేంద్రవరం, మే 26(ఆంధ్రజ్యోతి): ‘‘సంక్షేమం జెండా, అజెండా మనదే. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో.. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. దేశానికి చూపిస్తాం’’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ మహానాడు సందర్భంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంక్షేమం విషయంలో సీఎం జగన్‌ టీడీపీపై చేస్తున్న విమర్శల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. ‘‘టీడీపీకి మించి సంక్షేమం చేసిన పార్టీ రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెట్టిందే టీడీపీ. పేదల సంక్షేమం జెండా.. అజెండా మనదే. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క దళితుల కోసమే 27 పథకాలను అమలు చేశాం. జగన్‌ వచ్చి మొత్తం రద్దు చేశాడు. ఏవో రెండు, మూడు పథకాలు చూపించి అదే సంక్షేమం అని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన పథకాల వల్ల ఈ రాష్ట్రంలో ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటకు రాలేదు’’ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ కంటే తెలంగాణ ఆదాయం కేవలం రూ.3 వేల కోట్లు ఎక్కువ ఉండేదని, ఈ నాలుగేళ్లలో ఆ వ్యత్యాసం ఏకంగా రూ.32 వేల కోట్లకు పెరిగిపోయిందని మరొకరు చెప్పారు. మళ్లీ చంద్రబాబు గెలిస్తే.. అమ్మ ఒడి, పింఛన్లు వంటి పథకాలు ఆగిపోతాయని సీఎం జగన్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని, కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో సీఎం జగన్‌ ప్రమేయం కూడా ఉందని సీబీఐ అఫిడవిట్‌ నిరూపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హత్య చేసిన వ్యక్తులు ఆ రోజు తెల్లవారుజామున అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడి నుంచి అవినాశ్‌రెడ్డి.. జగన్‌కి, ఆయన సతీమణి భారతికి ఫోన్లు చేసి మాట్లాడటం వెనుక ఏం జరిగిందో బయటకు వస్తే దేశం తెల్లబోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం వివేకాను జగనే చంపించారన్న అనుమానాలు బలపడుతున్నాయని కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు అన్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

ఎస్సీ వర్గీకరణపై చర్చ

ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేవనెత్తారు. గతంలో టీడీపీ ఎస్సీలను వర్గీకరించి మాదిగలకు న్యాయం చేసిందని, ఇప్పుడు కూడా అదే వైఖరిని ప్రకటించాలని కోరారు. అయితే, మాల సామాజిక వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. కానీ, అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. మాదిగలకు న్యాయం చేసేందుకు టీడీపీ కట్టుబడి ఉంది. వారికి ప్రాధాన్యత ఇస్తూనే ఉప కులాలను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని, ఎక్కడ, ఎవరి జనాభా అధికంగా ఉంటే సంక్షేమ పథకాలు, సీట్ల విషయంలో ఆమేరకు వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉంది. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. పార్టీకి దన్నుగా నిలుస్తున్న బీసీలు,, మాదిగలకు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పటానికి ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించింది. కాగా, ఎన్టీఆర్‌ శత జయంతి కార్యక్రమాల నిర్వహణపై పొలిట్‌బ్యూరోలో చర్చించారు. ఇక, నారా లోకేశ్‌ చేస్తున్న యువగళం పాదయాత్రపైనా చర్చించారు. రాయలసీమలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లోకేశ్‌ ఎలా అడుగుపెడతాడో చూస్తామని సవాళ్లు విసిరినా.. వాటికి వెరవకుండా లోకేశ్‌ ధైర్యంగా ముందుకు సాగుతున్నారని సభ్యులు ప్రశంసించారు. సమావేశంలో అశోక్‌గజపతి రాజు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాబు పాలన చారిత్రక అవసరం: కాలువ

‘‘జగన్‌ నాలుగేళ్ల దుష్టపాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. జగన్‌ తీవ్రమైన నేరస్తుడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పాలన చారిత్రక అవసరం’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు అన్నారు. పొలిట్‌బ్యూరోలో చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. శని, ఆదివారాల్లో జరిగే మహానాడులో ఎన్టీఆర్‌ శత జయంతిని కూడా నిర్వహిస్తామమన్నారు. ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 5 తీర్మానాలు, ఉమ్మడిగా 4 తీర్మానాలను ప్రవేశ పెడతారన్నారు. కాగా, ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలని టీడీపీ నేత, తెలంగాణ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-05-27T03:47:20+05:30 IST