Share News

జలం జారిపోతోంది

ABN , First Publish Date - 2023-11-06T04:38:32+05:30 IST

ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా పడటం, ఎండలు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి.

జలం జారిపోతోంది

అడుగ ంటిన భూగర్భ జలాలు

ముఖ్యంగా సీమ, దక్షిణ కోస్తాలో ప్రభావం

లోతుకు పడిపోయిన నీటిమట్టాలు

ఈ ఏడాది వర్షాలు లేకపోవడం,

ఎండల తీవ్రత ఎక్కువ కావడమే కారణం

బోర్ల కింద సాగునీరు అందక రైతుల అవస్థలు

మరోవైపు విద్యుత్‌ కోతలతో సతమతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా పడటం, ఎండలు తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. వేసవిలో కన్నా భూగర్భంలో నీటిమట్టాలు మరింత పడిపోయాయి. ముఖ్యంగా రాయలసీమతో పాటు పల్నాడు, ప్రకాశం, జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. ఈ ఏడాది మే, అక్టోబరు నెలల్లో భూగర్భ జలమట్టాల గణాంకాలను పరిశీలిస్తే.. కోస్తాలో సగటున 9.38 మీటర్ల లోతులో, రాయలసీమలో 8.53 మీటర్ల లోతులో నీరు ఉందని భూగర్భ జలాలు, నీటి ఆడిట్‌ విభాగం పేర్కొంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో దాదాపు అన్ని జిల్లాల్లో నీటిమట్టాలు బాగా తగ్గాయి. గత పక్షం రోజుల్లో మరింత లోతుకు పోయాయని బోరు బావుల రైతులు చెబుతున్నారు. భూగర్భ జలం మీటర్ల కొద్దీ లోతుకు పోతుండటంతో బోర్ల కింద వ్యవసాయం కష్టతరంగా మారింది. ఓ వైపు విద్యుత్‌ కోతలు, మరోవైపు బోరు బావుల్లో నీటిమట్టాలు పడిపోతుండటంతో పొలాలు తడపడం కష్టసాధ్యంగా మారిందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అనధికారిక విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. కోతల్ని కూడా అంతరాయాలుగా ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు.

సాధారణంగా బోర్ల కింద ఉద్యాన పంటలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వరి, మిర్చి, వేరుశనగ, చిరుధాన్యాల పంటలు పండించే రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రెండున్నర గంటల్లో ఎకరం తడిసే ప్రాంతాల్లోనూ ఐదారు గంటలు పడుతోందని చెబుతున్నారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూన్‌, ఆగస్టు, అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా 36-39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు సాధారణ స్థాయిలోనూ వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణం. జూలై, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండలేదు. దీంతో కాలువలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయలేదు. ఫలితంగా భూమిలో తేమ లేకుండా నేల పొడిబారిపోయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో భూగర్భ జలాల వృద్ధికి కాంటూరు కందకాలు, నీటి చెలమలు, పంట కుంటలు వంటి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ దిశగా ఏ పథకాన్ని కూడా చేపట్టలేదు. గత నాలుగేళ్లు వర్షాలు అధికంగా కురిసి పంటలు దెబ్బతినగా, ఈ ఏడాది వర్షాభావంతో ఖరీ్‌ఫలో 27ు విస్తీర్ణంలో పంటే పడలేదు. రబీలోనూ నీటి గండం ఏర్పడి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కనీసం బోర్ల కింద సాగు చేయాలన్నా.. భూగర్భ జలాలు పైకి రాకపోవడటంతో పంటలు తడపడం కష్టమవుతోందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ వంటి ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయని రైతులు చెబుతున్నారు. ఎండల తీవ్రతకు సరిపడా నీరు అందడంలేదని అంటున్నారు.

Updated Date - 2023-11-06T04:38:32+05:30 IST