Share News

అవే అబద్ధాలు..!

ABN , First Publish Date - 2023-10-20T04:38:01+05:30 IST

అవే అబద్ధాలు.. మళ్లీ మళ్లీ అవే బడాయి మాటలు. చేయనిది చేసినట్లు.. ఏదో అంతా తానే చేసినట్లు కలరింగ్‌. లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు బిల్డప్‌. తనకు టీవీ చానల్‌ కానీ, సొంత పేపర్‌ కానీ లేవంటూ బుకాయింపు. అప్పులు తక్కువ చేశానంటూ రాజీలేని

అవే అబద్ధాలు..!

అంతా తానే చేసినట్లు కలరింగ్‌

సొంత పేపర్‌, చానల్‌ లేదని బుకాయింపు

కర్నూలు ఎమ్మిగనూరు సభలో జగన్‌ తీరు

‘జగనన్న చేదోడు’ నిధుల విడుదల

కర్నూలు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అవే అబద్ధాలు.. మళ్లీ మళ్లీ అవే బడాయి మాటలు. చేయనిది చేసినట్లు.. ఏదో అంతా తానే చేసినట్లు కలరింగ్‌. లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు బిల్డప్‌. తనకు టీవీ చానల్‌ కానీ, సొంత పేపర్‌ కానీ లేవంటూ బుకాయింపు. అప్పులు తక్కువ చేశానంటూ రాజీలేని అబద్ధాలు. స్వాతంత్ర్యానంతరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కల్పించిన ఉద్యోగాలు నాలుగు లక్షలైతే, అందులో తానే 2.07 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు. ఇలా ఒక్కటేమిటి... జగన్‌ ధారాళంగా అసత్యాలు పలికారు. సభకు వచ్చినవారంతా ఆయన తీరుకు తొలుత విస్మయపడి, ఆ తర్వాత నవ్వుకోవడం కనిపించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ‘జగనన్న చేదోడు’ పథకంలో బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తన కోసం రాష్ట్ర ప్రజలు సైనికుల్లాగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు. ‘‘రాబోయేది కురుక్షేత్రం. ఇది పేదలు.. పెత్తందారులకు మధ్య జరుగుతున్న సంగ్రామం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ముందు మీకు మంచి జరిగిందా.. లేదా అని ఆలోచించి ఓటు వేయాలి..’’ అని కోరారు. ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ మైదానంలో గురువారం నాలుగో విడత ‘జగనన్న చేదోడు’ నిధులను సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రంలో 3,25,020 మంది రజక, నాయీబ్రాహ్మణ, టైలర్ల ఖాతాల్లో రూ.325.02 కోట్లు జమచేశారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న సంకల్పంతోనే ‘చేదోడు’ కార్యక్రమం తీసుకువచ్చామని, ఈ పథకం కింద గత నాలుగేళ్లలో రూ.1,251 కోట్లు అందించామని తెలిపారు. గతానికి ఇప్పటికి పోల్చిచూడండని జగన్‌ సూచించారు.

చేదోడు, వైఎ్‌సఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, జగనన్నతోడు తదితర పథకాల కింద ఈ నాలుగేళ్లలో రూ2.38లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి ఖాతాల్లోకి జమచేశామని, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా అని పేర్కొన్నారు. గతంలో ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్‌... మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమేనన్నారు. ‘‘20వేల ఇంటి పట్టాలు ఇచ్చి 8వేల ఇళ్లు కట్టిస్తున్నాం. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చాం. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు, రాజధాని భూములు, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫైబర్‌గిడ్‌, మద్యం కొనుగోళ్లు...ఎక్కడ చూసినా దోచుకోవడం.. పంచుకోవడం, తినుకోవడం తప్ప ఏమి చేయలేదు’’ అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, గృహ నిర్బంధాల మధ్య జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన సాగింది. జిల్లాలో అసంపూర్తిగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, కృష్ణాజలాల పునఃపంపిణీ, హైకోర్టు తదితర అంశాలపై జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మిగనూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సిద్ధమయ్యారు. 50 మందికిపైగా తన పార్టీ నాయకులతో కలిసి బయల్దేరుతుండగా ఆదోని పోలీసులు వచ్చి ఆయనను ఇంట్లోనే నిర్భందించారు. నందవరం, గోనెగండ్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులను అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జగన్‌ ప్రసంగిస్తుండగానే...

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేక వాహనాల్లో పొదుపు మహిళలను జిల్లా అధికారులు ఎమ్మిగనూరు సీఎం సభకు తరలించారు. అంతమందికి సరిపడా సభా ప్రాంతంలో ఏర్పాట్లు లేకపోవడంతో ఉక ్కపోతతో మహిళలు ఇబ్బందిపడ్డారు. చిన్న పిల్లల తల్లులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జగన్‌ ప్రసంగం మొదలైన 15-20 నిమిషాలకే గుంపులు గుంపులుగా మహిళలు బయటకు వెళ్లిపోయారు. భోజనాలు, నీరు లేక జనం, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఏరులై పారిన కర్ణాటక మద్యం

జగన్‌ సభ ప్రాంగణం పరిసరాల్లోనే మద్యం జోరుగా పంపిణీ జరిగింది. వివిధ గ్రామాల నుంచి బస్సుల్లో వచ్చిన జనం....దిగిన వెంటనే వాళ్ల చేతికి కర్ణాటక టెట్రాప్యాకెట్లు, నీటి ప్యాకెట్లు అందించారు. వాటిని తీసుకుని పక్కకు వెళ్లి మద్యం సేవించి వారంతా సభావేదికకు చేరుకున్నారు. కొందరు ముఖ్య నాయకులు తమ వాహనాల్లో మద్యం సరఫరా చేశారు.

Updated Date - 2023-10-20T04:38:01+05:30 IST