స్టీరింగ్‌ ఊడి ఆర్టీసీ బస్సు బోల్తా

ABN , First Publish Date - 2023-06-07T03:26:08+05:30 IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు స్టీరింగ్‌ ఊడిపోవడంతో బోల్తా పడింది.

స్టీరింగ్‌ ఊడి ఆర్టీసీ బస్సు బోల్తా

19 మందికి గాయాలు

నరసన్నపేట, జూన్‌ 6: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు స్టీరింగ్‌ ఊడిపోవడంతో బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కోమర్తి ఫ్లైఓవర్‌ దాటగానే స్టీరింగ్‌ ఒక్కసారిగా ఊడిపోవడంతో అదుపు తప్పింది. డ్రైవర్‌ బస్సును నిలిపివేసేందుకు యత్నించగా.. రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌కు ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగంలో ఏక్సిల్‌ విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు, సిబ్బందిని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసన్నపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. నరసన్నపేట ఎస్‌ఐ సింహాచలం దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-07T03:26:08+05:30 IST