కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.!
ABN , First Publish Date - 2023-08-20T03:58:03+05:30 IST
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను చాకుతో గొంతు కోసి, విచక్షణా రహితంగా పొడిచి చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో శనివారం జరిగింది.
భార్య గొంతుకోసి, 15 సార్లు పొడిచి చంపిన భర్త
ఆకివీడు పోలీస్‌స్టేషన్ ఎదుట మృతురాలి బంధువుల రాస్తారోకో
ఆకివీడు, ఆగస్టు 19: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను చాకుతో గొంతు కోసి, విచక్షణా రహితంగా పొడిచి చంపిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో శనివారం జరిగింది. ఆకివీడు పట్టణ పరిధిలోని జవహర్ ప్రాంతంలో మారడుగుల సత్యనారాయణమూర్తి-పద్మ దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి సాయిలక్ష్మి కమల సంధ్య (24) అదే ప్రాంతంలో రైస్ మిల్లులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వాడపల్లి రాంబాబును ప్రేమించగా మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఏడాదిన్నర వయస్సు గల బాబు ఉన్నాడు. రాంబాబు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే తమిళనాడులో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చి కాపురానికి రావాలని పెద్దల సమక్షంలో కోరగా సంధ్య నిరాకరించి విడాకుల కోసం పోలీసులను ఆశ్రయించింది. అయినా తనతో కాపురం చేయాలంటూ రాంబాబు ఆమెతో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ వేధింపులు భరించలేక సంధ్యను తల్లిదండ్రులు కొన్నిరోజులు మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. నాలుగు రోజులు క్రితమే వారు ఆకివీడు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సంధ్యను మాట్లాడుకుందామని చెప్పిన రాంబాబు సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో వెంట తెచ్చుకున్న చాకుతో సంధ్యను విచక్షణారహితంగా 15 సార్లు పొడిచి, మెడ కోయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం రాంబాబు పద్మకు ఫోన్ చేసి విషయం చెప్పి పోలీస్‌స్టేషన్‌లో లొంగి పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న సంధ్య తల్లిదండ్రులు రక్తపుమడుగులో పడిఉన్న కుమార్తెను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఆకివీడు పోలీస్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై మృతురాలి బంధువులు రాస్తారోకో చేశారు.