పాత పింఛన్‌ ఉద్యమానికి ఇక ఊపు!

ABN , First Publish Date - 2023-03-26T04:21:51+05:30 IST

ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఈనెల 31 విజయవాడకు రానున్న నేపథ్యంలో ఎన్‌పీఎ్‌స(కొత్త పింఛన్‌ పథకం) కాక మొదలైంది.

పాత పింఛన్‌ ఉద్యమానికి ఇక ఊపు!

31న బెజవాడకు ఏఐఆర్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మిశ్రా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ముప్పేట దాడికి వ్యూహం

బెజవాడ వేదికగా ‘ఆపరేషన్‌ ఎన్‌పీఎస్‌’

రాష్ట్రంలోని సీపీఎస్‌ రద్దు పోరాటాలపై ఆరా

ఇక్కడి ప్రధాన సంఘాలతో భేటీకి నిర్ణయం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఈనెల 31 విజయవాడకు రానున్న నేపథ్యంలో ఎన్‌పీఎ్‌స(కొత్త పింఛన్‌ పథకం) కాక మొదలైంది. జాతీయ స్థాయిలో ఎన్‌పీఎస్‌ రద్దు కోసం పోరుబాట పట్టిన మొట్టమొదటి అఖిల భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏఐఆర్‌ఎఫ్‌. దేశవ్యాప్తంగా అన్ని జోన్ల పరిధిలోని రైల్వే కార్మిక సంఘాలు సంయుక్తంగా ఏఐఆర్‌ఎఫ్‌ గొడుగు కింద ఉద్యమబాట పట్టాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని బ్యాంకింగ్‌, పోస్టల్‌, ఎల్‌ఐసీ తదితర ఇతర అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా ఏఐఆర్‌ఎ్‌ఫతో జత కట్టి ఉమ్మడి కార్యచరణకు శ్రీకారం చుట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను లీడ్‌ చేస్తున్న ఏఐఆర్‌ఎఫ్‌ జాతీయ స్థాయిలో ఉద్యమ కార్యాచరణకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం పార్లమెంటులో పునఃసమీక్షకు కమిటీని వేసింది. ఈ తరుణంలో ఏఐఆర్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా విజయవాడకు వస్తుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఎన్‌పీఎస్‌ అమలు చేస్తున్న రాష్ర్టాలపై కూడా ఆయన దృష్టి సారించారు. మన రాష్ట్రంలో ఎన్‌పీఎ్‌సనే సీపీఎ్‌స(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)గా పేర్కొంటున్నారు. పాత పింఛన్‌ పథకం కోసం ఒకేసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ముప్పేట దాడికి శివగోపాల్‌ మిశ్రా వ్యూహరచన చేయటం సంచలనం సృష్టిస్తోంది. మన రాష్ట్రంలోనూ సీపీఎస్‌ ఉద్యమం జోరుగా నడుస్తోంది. అదే స్ఫూర్తితో దేశంలోని అనేక రాష్ర్టాలు సీపీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం ఉద్యమ బాట పట్టాయి. దీంతో పలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇప్పటికే పాత పెన్షన్‌ పునరుద్ధరణ బాట పడుతున్నాయి.

సీపీఎస్‌ రద్దుకు దేశంలోనే మొదటగా హామీ ఇచ్చినది మన రాష్ట్ర ప్రభుత్వమే కావటం గమనార్హం. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా.. సీపీఎస్‌ రద్దు జాడ లేకపోగా.. రకరకాల పేర్లతో మభ్యపెట్టే యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరంగా పోరాడుతున్న ఏఐఆర్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కూడా పోరాటం చేయాలని భావిస్తోంది. సమష్టిగా ఒకేసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద కత్తి పెడితే తప్ప.. కేంద్ర స్థాయిలో కీలక నిర్ణయం వెలువడదని ఆ సంఘం భావిస్తోంది. అందుకే ఇక్కడి ఉద్యోగ సంఘాల జేఏసీల అగ్రనేతలతో ప్రత్యేకంగా భేటీ అవ్వాలని శివ గోపాల్‌ మిశ్రా నిర్ణయించారు. రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దు పోరాటాల గురించి ఆయన ఇప్పటికే ఆరా తీశారు. ఓపీఎస్‌ దిశగా వెళుతున్న రాష్ర్టాలను ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ హెచ్చరించిన పరిణామాలపైనా ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశం ఉంది. రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నిర్ణయాన్ని ఏఐఆర్‌ఎఫ్‌ పూర్తిగా తప్పుబడుతోంది. కేంద్రం రాష్ర్టాలపై, రాష్ర్టాలు కేంద్రంపై సాకులు చెబుతూ పాత పింఛన్‌పై తప్పించుకొనే ధోరణి నేపథ్యంలో ఒకేసారి రెండు స్థాయిల్లో జాతీయ పోరాటం జరిగితే తప్ప.. కేంద్ర, రాష్ర్టాలు దిగిరావన్న అభిప్రాయానికి ఏఐఆర్‌ఎఫ్‌ వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల అగ్రనేతలు, ప్రధాన జేఏసీల అగ్రనేతలతో ఆయన మాట్లాడనున్నారు. శివ గోపాల్‌ మిశ్రా విజయవాడ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి కార్యాచరణ ఇవ్వబోతున్నారన్నదానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-03-26T04:21:51+05:30 IST