Viveka Murder Case : అరెస్టు ఆపలేం!

ABN , First Publish Date - 2023-03-18T03:14:04+05:30 IST

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ‘అనుమానితుడి’గా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ తమ్ముడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ఆయనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం

Viveka Murder Case : అరెస్టు ఆపలేం!

కీలక దశలో దర్యాప్తు..

జోక్యం చేసుకోలేమన్న టీ-హైకోర్టు

వివేకా కేసులో అవినాశ్‌ రెడ్డికి ఎదురు దెబ్బ

సీబీఐపై ఆయన ఆరోపణలకు ఆధారాల్లేవు

వాంగ్మూలాలు మార్చినట్లు కనిపించలేదు

దర్యాప్తు అధికారి ఏకపక్షంగా వెళ్లడంలేదు

స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడం తప్పనిసరి కాదు

అయినా.. ఈ కేసులో చేస్తూనే ఉన్నారు

సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చు

కనుచూపు మేర వరకే లాయర్‌కు అనుమతి

దర్యాప్తు గదిలోకి మాత్రం అనుమతి లేదు

తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు

అవినాశ్‌ రెడ్డి పిటిషన్లు కొట్టివేత

అరెస్టుకు లైన్‌ క్లియర్‌

‘‘అనుమానితుడు, నిందితుడు, సాక్షి అనే తేడా లేకుండా సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద దర్యాప్తు అధికారి తన విచక్షణ మేరకు ఎవరినైనా విచారణకు పిలువవచ్చు. సీబీఐ సమర్పించిన స్టేట్‌మెంట్‌లు, ఇతర రికార్డులను పరిశీలిస్తే దర్యాప్తు అధికారి వివక్ష చూపుతున్నట్లు కనిపించడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షుల స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డింగ్‌ తప్పనిసరిగా చేయాలనేమీ లేదు. దర్యాప్తు అధికారి విచక్షణ మేరకు రికార్డింగ్‌ ఉంటుంది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి ఇందుకు సీబీఐ అంగీకరించింది. సీబీఐ సమర్పించిన రికార్డులు పరిశీలించాం. అవినాశ్‌ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా వాంగ్మూలాలను మార్చినట్లుగా కనిపించడంలేదు. స్టేట్‌మెంట్‌లు సక్రమంగానే ఉన్నాయి. వాటిని మార్చినట్లు ఆధారాలు లేవు. సీబీఐపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు.’’

- హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ‘అనుమానితుడి’గా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ తమ్ముడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ఆయనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘‘వివేకా హత్య కేసులో సీబీఐ నన్ను అరెస్టు చేయవద్దు. తదుపరి విచారణ జరపవద్దు. నా స్టేట్‌మెంట్‌లను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. న్యాయవాది సమక్షంలోనే విచారించాలి’’ అని కోరుతూ అవినాశ్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోరాదని ‘నిహారికా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేసింది. పిటిషనర్‌ కోరినట్లుగా అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని సీబీఐని ఆదేశించలేమని పేర్కొంది. అలాగే, సీఆర్పీసీ 161 కింద పిటిషనర్‌ను సీబీఐ విచారించకుండా అడ్డుకోవడం సైతం సమంజసం కాదని స్పష్టం చేసింది. ‘‘దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిటిషనర్‌ కోరినట్లు... బ్లాంకెట్‌ ఆర్డర్‌లు ఇవ్వడం సరికాదు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు. తనకు అవసరమని భావించినప్పుడు పిటిషనర్‌ను సీఆర్పీసీ 160 కింద విచారణకు పిలువవచ్చు’’ అంటూ సీబీఐకి స్వేచ్ఛ ఇచ్చింది. అవినాశ్‌ రెడ్డి కోరిన విధంగా ఆయన స్టేట్‌మెంట్‌ ఆడియో, వీడియో రికార్డు చేయాలని.. పిటిషనర్‌ కనుచూపు మేరలో ఉండేలా ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాలని సీబీఐని ఆదేశించింది. అయితే, దర్యాప్తు చేసే గదిలోకి మాత్రం న్యాయవాదికి అనుమతి లేదని స్పష్టం చేసింది. విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాది జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారన్న పిటిషనర్‌ ఆరోపణలను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసిన రెండు ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ల (ఐఏ)లను కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది.

సీబీఐకి లైన్‌క్లియర్‌..

హైకోర్టు తీర్పు నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డి అరెస్టుకు లైన్‌ క్లియర్‌ అయినట్లే. ఆయన కీలక అనుమానితుడని, అరెస్టు చేస్తామని ఇప్పటికే సీబీఐ స్పష్టం చేసింది. అయితే... అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌పై తీర్పు ఇచ్చేదాకా అరెస్టు వద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తాజా తీర్పుపై అవినాశ్‌ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయి.

హోరాహోరీ వాదనలు...

అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌పై హోరాహోరీగా వాదనలు జరిగాయి. సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీలు నాగేంద్రన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. అవినాశ్‌ రెడ్డిని సాక్షిగా పిలిచినప్పటికీ ఈ కేసులో ఆయన కీలకమైన అనుమానితుడని పేర్కొన్నారు. అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి ఇద్దరూ నిందితులే అని, ఎప్పుడైనా అరెస్ట్‌ జరగవచ్చని సోమవారం జరిగిన విచారణలో స్పష్టం చేశా రు. వివేకాహత్యలో పిటిషనర్‌ పాత్ర స్పష్టంగా ఉందని.. ఆయనే కీల క పాత్ర పోషించారని.. వివేకా హత్య తర్వాత అన్ని ఆధారాలను స్వయంగా చెరిపేశారని పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరిందని.. ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటే దర్యాప్తునకు ఆటంకాలు ఎదురవుతాయని తెలిపారు. పిటిషనర్‌ అడిగిన విధంగా ఆయన స్టేట్‌మెంట్‌లను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశామన్నారు. విచారణ సమయంలో ఆయన న్యాయవాదిని కూడా అనుమతించామని పేర్కొన్నారు. కేవలం తన అరెస్టును అడ్డుకోవడానికే పిటిషనర్‌ కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నా రు. ఇందులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా ఇంప్లీడ్‌ అయ్యారు. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేయడానికంటే ముందే హత్య విషయం అవినాశ్‌రెడ్డికి తెలుసునని చెప్పారు. 2 నిమిషాల వ్యవధిలోనే అవినాశ్‌రెడ్డి హత్య జరిగిన ప్రాంతానికి వచ్చారని.. వివేకా గుండెపోటుతో మరణించారని స్థానిక నాయకురాలు శశికళకు, సీఐ శంకరయ్యకు చెప్పారని తెలిపారు. వివేకాది సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతోపాటు తనే స్వయంగా ఆధారాలు చెరిపేశాడని తెలిపారు. అవినాశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సునీతారెడ్డితో సీబీఐ కుమ్మక్కైందని.. ఆమె దాఖలు చేసే పిటిషన్‌లలో సీబీఐ హస్తముందని తెలిపారు. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దస్తగిరిని అప్రూవర్‌గా అంగీకరించడం చెల్లదన్నారు. హత్యజరిగిన మూడేళ్ల తర్వాత సాక్షిగా పిలిచి.. అరెస్ట్‌ చేస్తామనడం సరికాదని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-18T03:14:04+05:30 IST