Share News

చేతకాని వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-11-29T04:17:31+05:30 IST

రైతు, కార్మిక ఉద్యమ నేతలపై కేసులు నమోదు చేస్తే సహించేది లేదని పలువురు రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.

చేతకాని వైసీపీ ప్రభుత్వం

జాబు ఇవ్వని జగన్‌ జాబు తీసెయ్యాలి

రైతు, కార్మిక ఉద్యమ నేతలపై కేసులు పెడితే సహించం

ఉద్యమకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వం

రైతుల మహాధర్నా ముగింపు సభలో వక్తల ధ్వజం

విజయవాడ(ధర్నాచౌక్‌), నవంబరు 28: రైతు, కార్మిక ఉద్యమ నేతలపై కేసులు నమోదు చేస్తే సహించేది లేదని పలువురు రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కర్షక, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రెండు రోజుల మహాధర్నా మంగళవారం ముగిసింది. పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేతలు, సీనియర్‌ న్యాయవాదులు నక్క సుబ్బారావు, సుంకర రాజేంద్రప్రసాద్‌ మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారు మాటాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యలపై స్పందించే వారి పౌరహక్కులను హరిస్తూ, ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి ఉద్యమాలు నిర్వహించకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ చేతకాని ప్రభుత్వమని, నాలుగున్నరేళ్లలో టీచర్ల పోస్టులు భర్తీ చేయలేదని మండిపడ్డారు. జాబు ఇవ్వని జగన్‌ జాబును తీసివేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన కేంద్రం దుర్మార్గంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పలు రైతు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్‌, కేశవరావు, జాస్తి కిశోర్‌, రావుల వెంకయ్య, జి.ఓబులేసు, వి.ఉమామహేశ్వరరావు, పి.జమలయ్య, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ఏవీ నాగేశ్వరరావు, ఏపీఎన్జీవో నేత ఎ.విద్యాసాగర్‌, జర్నలిస్టు నేత డి.సోమసుందర్‌, ఏపీ లారీ అసోసియేషన్‌ నేత వైవీ.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T04:17:32+05:30 IST