Share News

అన్నదాత గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2023-12-03T03:07:55+05:30 IST

తుఫాన్‌ హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఖరీఫ్‌ వరి పంట సగానికిపైగా ఇంకా పొలాల్లోనే ఉంది.

అన్నదాత గుండెల్లో గుబులు

దూసుకొస్తున్న ‘మిచౌంగ్‌’

ధాన్యం రైతుల్లో ఆందోళన

ఆక్వా, పత్తి దెబ్బతినే ప్రమాదం

హడావుడిగా వరి కోతలు

ధాన్యం ఆరబెట్టి కాపాడుకునేందుకు

రైతన్నల తాపత్రయం

సర్కారు సాయం లేదు.. హెచ్చరికలే!

ధాన్యం రైతుల్లో ఆందోళన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తుఫాన్‌ హెచ్చరికలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఖరీఫ్‌ వరి పంట సగానికిపైగా ఇంకా పొలాల్లోనే ఉంది. గత నెల రోజుల్లో సుమారు 40ు మాత్రమే కోశారు. ఈ సమయంలో గాలి-వాన వస్తే.. కోత దశలో ఉన్న వరి నేల వాలే అవకాశం ఉంది. పైరు పడిపోతే.. వరి కంకులు దెబ్బతింటాయి. ధాన్యం కోసి, కుప్పలేసి, నూర్పిడి చేసి, కళ్లాల్లో ఆరబోసిన రైతులు తుఫాన్‌ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. ఆదరబాదరాగా ధాన్యాన్ని బస్తాలకెత్తి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిల్వ వసతి లేని రైతులు ధాన్యాన్ని రోడ్లు, పొలాల పక్కన ఆరబెట్టి, గాలిలో దీపం పెట్టినట్లు చూస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో శనివారం రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి. తుఫాన్‌ దక్షిణకోస్తా ప్రాంతంలోనే తీరం దాటే పరిస్థితి ఉండటంతో అతితీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో వరి రైతులు తలలు బాదుకుంటున్నారు. పత్తి రైతులు పరేషాన్‌ అవుతున్నారు. ఇంకా 3-5 క్వింటాళ్ల పత్తి చేలల్లోనే ఉంది. ఈ సమయంలో వానపడితే పగిలిన పత్తి దారంలా నీరుగారిపోయే అవకాశం ఉంది. కాయలు బూజేసి, గుడ్డి పత్తిలా మారే ప్రమాదం ఉందని రైతులు చెప్తున్నారు.తుఫాన్‌పై ప్రభుత్వం హెచ్చరికలు చేయడం తప్ప.. రైతులకు అండగా నిలిచే చర్యలు చేపట్టడం లేదు. టార్పాలిన్‌ పట్టల పంపిణీ, పంట ఉత్పత్తులు తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లు, గిడ్డంగుల సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టిన దాఖలా లేదు.

రైతాంగం అప్రమత్తం

ఏలూరు సిటీ, భీమవరం రూరల్‌, నెల్లూరు, డిసెంబరు 2: మిచౌంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరి మాసూళ్ల ముమ్మరం చేసిన రైతులు, పంటను రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుఫాన్‌ నేపఽథ్యంలో విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేసిందని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. టోల్‌ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌ చేసి విద్యుత్‌ సమస్యలను తెలపవచ్చన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ హరినారాయణన్‌ అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో 1077 నంబరుతో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. 3 నుంచి 5వ తేదీ వరకు అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రభుత్వ సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వరాదని ఆదేశించారు.

Updated Date - 2023-12-03T03:07:56+05:30 IST