YCP Teacher MLC : టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే

ABN , First Publish Date - 2023-03-18T03:35:58+05:30 IST

తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. బెదిరింపులు, తాయిలాలు, బోగస్‌ ఓట్లు, కోట్ల కొద్దీ డబ్బుల పంపిణీ.. ఇవన్నీ చేసినా పాలక పక్ష ..

YCP Teacher MLC : టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే

హోరాహోరీ పోరులో బొటాబొటీ విజయం

అనంతపురం విద్య-చిత్తూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. బెదిరింపులు, తాయిలాలు, బోగస్‌ ఓట్లు, కోట్ల కొద్దీ డబ్బుల పంపిణీ.. ఇవన్నీ చేసినా పాలక పక్ష అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కారు. ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా పోటీచేయడం అధికార పార్టీకి బాగా కలిసి వచ్చినట్లు స్పష్టమవుతోంది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి కేవలం 169 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ 50శాతానికిపైగా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో వైసీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థికి దీటుగా ఓట్లు తెచ్చుకున్న ఒంటేరు.. మూడో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించాలని కోరారు. పోలైన ఓట్లలో ఒక శాతం మెజారిటీ కూడా రానందున రీకౌంటింగ్‌ జరపాలని కోరారు. అయితే వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అఽధికారి శుక్రవారం మధ్యాహ్నం డిక్లరేషన్‌ ఇచ్చేశారు. దీంతో రీకౌంటింగ్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఒంటేరు.. ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్‌ నిర్వహణపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మరోవైపు.. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వైసీపీ బలపరచిన అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయం సాధించారు.

శుక్రవారం తెల్లవారుజామున ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించి, డిక్లరేషన్‌ను అందించారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉమ్మడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గురువారం మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యేనాటికి పీడీఎఫ్‌(యూటీఎ్‌ఫ-ఎస్టీయూ) అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు, ఏపీటీఎఫ్‌ సహా ఇతర సంఘాల మద్దతుతో నిలబడిన ఎల్‌సీ రమణారెడ్డికి 3,465 ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరి ఓట్లు కలిపితే 12,373 అవుతాయి. ఈ నియోజకవర్గానికి మొత్తం 24,747 ఓట్లు పోలవ్వగా, 456 ఓట్లు చెల్లలేదు. చెల్లిన 24,291 ఓట్లలో సగం+1 ఓట్లు వచ్చినవారే విజేత. అంటే, 12,146ఓట్లు వస్తే గెలుస్తారు. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో మ్యాజిక్‌ ఫిగర్‌కు మించిన ఓట్లు పీడీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ అభ్యర్థులకు కలిపి 12,373 ఓట్లు వచ్చాయి. ఇద్దరూ వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి. రెండో ప్రాధాన్య ఓట్ల తర్వాత అతి కష్టమ్మీద వైసీపీ అభ్యర్థికి గెలుపు సాధ్యమైంది. చంద్రశేఖర్‌రెడ్డికి 11,714, పీడీఎఫ్‌ అభ్యర్థి బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి.

టీచర్లలో వ్యతిరేకత భారీగానే..

ప్రభుత్వంపై ఉపాధ్యాయ వర్గాల్లో భారీగా వ్యతిరేకత ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో స్పష్టమైంది. పశ్చిమ స్థానంలో పోలైన 25,879ఓట్లలో వైసీపీ అభ్యర్థి 8,846 తొలి ప్రాధాన్య ఓట్లు సాధించగలిగారు. ఇందులో కూడా బోగస్‌ ఓట్లు, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్ల ఓట్లే అధికమని స్పష్టమవుతోంది. ఒంటేరుకు 6,853, కత్తి నరసింహారెడ్డికి 4,162ఓట్లు, చామల అనిల్‌ వెంకటప్రసాద్‌రెడ్డికి(రూపాయి డాక్టర్‌) 3,212ఓట్లు, జీవీ నారాయణరెడ్డికి 1,345 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్‌ రౌండ్లలో దిగువ నుంచి గంగాధర్‌రెడ్డి 13ఓట్లు, శ్రీనివాసరావు 16 ఓట్లు, వరలక్ష్మి 24 ఓట్లు, మదన్‌మోహన్‌రెడ్డి 73 ఓట్లు, అనిల్‌కుమార్‌రెడ్డి 186 ఓట్లు, రామశేషయ్య 187 ఓట్లు, మాధవరావు 354 ఓట్లు, నారాయణరెడ్డి 1,325 ఓట్లు, అనిల్‌ వెంకటప్రసాద్‌రెడ్డి 3,212 ఓట్లు, కత్తి నరసింహారెడ్డి 4,162 ఓట్లు కలిపి.. ఫలితం ప్రకటించారు. తూర్పు సీమ స్థానంలోనూ హోరాహోరీ పోరు నడిచింది. ఏపీటీఎఫ్‌, పీడీఎఫ్‌ మధ్య టీచర్ల ఓట్లు చీలిపోవడం.. బోగస్‌ ఓట్లు, అక్రమాలతో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయంటున్నారు.

Updated Date - 2023-03-18T03:35:58+05:30 IST