లోక్‌సభలో టీడీపీ వర్సెస్ వైసీపీ
ABN , First Publish Date - 2023-09-20T02:40:18+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని సభలో లేవనెత్తగా వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడును వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి దూషించగా, ఆయనపై ప్యానల్ స్పీకర్ ఎన్‌కే ప్రేమచంద్రన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా దేశం అనుభవాలపై జరిగిన చర్చలో సోమవారం ఏపీకి సంబంధించి తొలుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును ప్రస్తావించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కోసం ఆ ప్రాజెక్టును అమలు చేసే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారన్నది ఆరోపణ మాత్రమేనని, ఆ డబ్బులు చంద్రబాబుకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు మళ్లించినట్లు సీఐడీ నిరూపించలేకపోయిందని స్పష్టం చేశారు. ఇలాంటి రాజకీయ కక్షలు, రాజకీయ నిర్బంధాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అన్ని రాష్ట్రాల్లో ఆగిపోవాలని జయదేవ్ ఆకాంక్షించారు. చంద్రబాబును విడుదల చేయడానికి జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. జయదేవ్ మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కూర్చోరా బాబూ.. అరేయ్ కూర్చోరా!: మిథున్
జయదేవ్ మాట్లాడిన తర్వాత వైసీపీ సభ్యుడు మిథున్ రెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రామ్మోహన్ నాయుడును మిథున్ రెడ్డి దూషించారు. ‘కూర్చోరా బాబూ.. కూర్చో.. అరేయ్ కూర్చోరా..’ అంటూఅసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుకు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు భరించాల్సి ఉందని, కానీ. జీవోలో పేర్కొన్న అంశాన్ని ఒప్పందంలో పేర్కొనలేదని ఆరోపించారు. దీంతో ప్యానల్ స్పీకర్ జోక్యం చేసుకొని.. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో కోర్టు పరిధిలో ఉన్న అంశంపై పార్లమెంటులో మాట్లాడటం సరికాదు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లవద్దు’ అని సూచించారు. అయితే, చంద్రబాబు పీఏకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిందని, ఆయన దేశం విడిచి వెళ్లిపోయారని మిథున్ రెడ్డి చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని టీడీపీ ఎంపీలు ఎలా లేవనెత్తారని ప్రశ్నించారు. దేశంలో ఏ స్కామ్‌స్టర్ కూడా తాను దోషినని చెప్పరన్నారు. చంద్రబాబును ఉద్దేశించి మిథున్‌రెడ్డి అభ్యంతరకరమైన పదాన్ని వాడటంతో ఆ వ్యాఖ్యను లోక్‌సభ సచివాలయం రికార్డుల నుంచి తొలగించింది. ‘ఇలాంటి వ్యాఖ్యలను అనుమతించబోను. ఈ అంశాలపై కోర్టునే నిర్ణయించనివ్వండి’ అని ప్యానల్ స్పీకర్ స్పష్టం చేశారు.