NCBN ARREST: ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2023-09-18T02:51:42+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు వరుసగా ఐదోరోజు ఆదివారం కూడా కొనసాగాయి.

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణుల ఆందోళనల జోరు ..
వరుసగా ఐదో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
చర్చిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రత్యేక ప్రార్థనలు
రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెల్లువెత్తిన పోస్టుకార్డులు
’బాబుతో నేను’ సంతకాలకు భారీ స్పందన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్) : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు వరుసగా ఐదోరోజు ఆదివారం కూడా కొనసాగాయి. ‘బాబుకు తోడుగా మేము సైతం’ అంటూ టీడీపీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుంచీ సంఘీభావం వెల్లువెత్తుతోంది. పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఎమ్మార్పీఎస్, జైభీమ్ పార్టీ శ్రేణులు పాదయాత్రలు, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకచోట్ల కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు జరిపారు. ’బాబుతో నేను’ సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన వస్తోంది. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలనీ, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ టీడీపీ నేతలు ఆలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దివ్యాంగులు రిలే దీక్షలు నిర్వహించారు. కొత్తపట్నం తీరంలో టీడీపీ నాయకులు జలదీక్ష చేపట్టారు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెయ్యి పోస్టుకార్డులు పంపారు. నరసన్నపేట మండలంలో ప్రజలు, కార్యకర్తలు.. చిక్కాలవలస నుంచి అరసవల్లి వరకు 43 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవర చెరువులో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు విశాఖ జిల్లా గోపాలపట్నంలో అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. కాగా, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు టీడీపీ కార్యకర్తలు ఆరుబయట నేలపై పడుకొని సంఘీభావం తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆర్కే బీచ్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించారు.
రాజమహేంద్ర వరంలో మాజీ మంత్రి జవహర్ ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు. నందిగామ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య నేతృత్వంలో తెలుగు మహిళలు అంబారుపేట సత్తెమ్మ తల్లి ఆలయం నుంచి పరిటాల ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర జరిపారు. గజపతి నగరం నుంచి విజయనగరం పైడిపల్లి అమ్మవారి ఆలయం వరకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకుని, నాయకుల్ని అరెస్టు చేశారు. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనపర్తి ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. పెదకాకానిలో మహిళలు పాదయాత్ర చేసి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కావలి, మంగళగిరి, తాడికొండ తదితర ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కాగడాలతో ర్యాలీలు జరిపాయి. ల్యాండ్, శాండ్, వైన్ కుంభకోణాల్లో నిండా మునిగిన అవినీతి సామ్రాట్ జగన్‌రెడ్డి తన అవినీతి మరకను చంద్రబాబుకు అంటించే కుతంత్రం చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేతలు మండిపడ్డారు.