TDP : పట్టభద్ర ఎన్నికల్లో టీడీపీ హవా

ABN , First Publish Date - 2023-03-18T03:24:10+05:30 IST

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలను గెలుచుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది.

TDP : పట్టభద్ర ఎన్నికల్లో టీడీపీ హవా

ఉత్తరాంధ్ర, తూర్పు సీమలో విజయం

పశ్చిమ సీమలో వైసీపీతో హోరాహోరీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాలను గెలుచుకుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటులో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,01,335 మంది (పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి) ఓటు హక్కు వినియోగించుకోగా, ఎనిమిది రౌండ్లుగా విభజించి గురువారం ఉదయం నుంచి లెక్కింపు ప్రారంభించారు. తొలి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు.. వైసీపీకి చెందిన సుధాకర్‌పై 4,048 ఓట్లు, రెండో రౌండ్‌లో 4,655, మూడో రౌండ్‌లో 4,514, నాలుగో రౌండ్‌ లో 3,704, ఐదో రౌండ్‌లో 3,331 ఓట్లు, ఆరో రౌండ్‌లో 2,891 ఓట్లు, ఏడో రౌండ్‌లో 3,616, ఎనిమిదో రౌండ్‌లో 385 ఓట్లు మెజారిటీ సాధించారు. మొత్తం 8 రౌండ్లలో చిరంజీవిరావుకు 82,957 ఓట్లు లభించగా, సుధాకర్‌కు 55,749 ఓట్లు వచ్చాయి. అంటే 27,208 ఓట్ల మెజారిటీ సాధించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభ 35,148 ఓట్లు పొందారు. 10,884 ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ డిపాజిట్‌ కోల్పోయారు. మొత్తం 2,01,335 ఓట్లు పోలవ్వగా...అందులో 12,318 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలో విజయానికి అవసరమైనన్ని ఓట్లు ఎవరికీ లభించకపోవడంతో అధికారులు శుక్రవారం సాయంత్రం ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎలిమినేషన్‌ తర్వాత చిరంజీవిరావు విజయం సాధించారు. అటు తూర్పు సీమ పట్టభద్రుల స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌విజయం సాధించారు. చెల్లిన 2,48,360 ఓట్లలో ఆయనకు 1,12,514 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 85,252 ఓట్లు వచ్చా యి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో శ్రీకాంత్‌కు 27,262 ఓట్ల ఆధిక్యం లభించింది. అయితే 50 శాతానికి మించిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అవసరమైన ఓట్లు లభించాయి. అంతకు ముందే కౌంటింగ్‌ హాలు నుంచి వైసీపీ నేతలు వెళ్లిపోయారు. ఇక్కడ పీడీఎఫ్‌ 38,001 ఓట్లతో మూడో స్థానంలో ఉంది. చెల్లని ఓట్ల సంఖ్య 20,979. బీజేపీ అభ్యర్థి దయాకర్‌రెడ్డికి 6,341 ఓట్లు పడ్డాయి.

వెన్నపూసకు 1,449 ఓట్ల స్వల్ప మెజారిటీ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నువ్వా.. నేనా అన్న రీతిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది. ఈ స్థానానికి 49 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 2,44,307 ఓట్లు పోలయ్యా యి. అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఒక్కో రౌండ్‌కు 24 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 8 రౌం డ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్‌ నుంచి 6వ రౌండ్‌ వరకూ వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యం కనబరిచారు. 7వ రౌండ్‌లో అనూహ్యంగా టీడీ పీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి మెజారిటీ వచ్చిం ది. తిరిగి 8వ రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి పైచేయి సాధించారు. ఎనిమిది రౌండ్లలో 1,92,018 ఓట్లు లెక్కించగా.. వైసీపీ అభ్యర్థికి 74,678 ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 73,229 ఓట్లు వచ్చాయి. అంటే రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు.

Updated Date - 2023-03-18T03:24:10+05:30 IST