టీడీపీ ప్రభుత్వంలోనే మేలు
ABN , Publish Date - Dec 14 , 2023 | 03:08 AM
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని అంగన్వాడీ యూనియన్లు ఖండించాయి.
నాటి వేతనం 7 వేలు కాదు.. రూ.10,500
వైసీపీ సర్కారువి తప్పుడు ప్రచారాలు
జగన్ వచ్చాక పెంచింది వెయ్యి రూపాయలే
మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రకటనపై అంగన్వాడీల ఖండన
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని అంగన్వాడీ యూనియన్లు ఖండించాయి. వైసీపీ ప్రభుత్వంలో కంటే గత టీడీపీ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందని స్పష్టం చేశాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనం రూ. 7 వేలు మాత్రమేనంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, అయితే, గత టీడీపీ ప్రభుత్వ కాలంలోనే అంగన్వాడీల జీతం నెలకు రూ.10,500 ఉందని, జగన్ సీఎం అయిన తర్వాత పెంచింది రూ.1000 మాత్రమేనని వివరించాయి. వైసీపీ ప్రభుత్వంలోనే మూడు వేలు పెంచినట్లు ప్రచారం చేసుకోవడం దుర్మార్గమంటూ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ), ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎ్‌ఫటీయూ) నేతలు సుబ్బరావమ్మ, బేబిరాణి, లలితమ్మ, జ్యోతి తదితరులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే, హెల్పర్లకు, మినీ వర్కర్లకు గతంలో జీతం నాలుగున్నర వేలు మాత్రమే ఉన్నట్లు అవాస్తవాలను ప్రచారం చేయడం దారుణమని, వారికి నెలకు జీతం రూ. 6 వేలు ఉండేదని తెలిపారు. మంగళవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలోని అవాస్తవాలను సరిదిద్ది, వాస్తవాలతో తాజాగా ప్రకటన జారీ చేయాలని కోరుతూ మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విద్యాదీవెన, ఆసరా, రైతు భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకూ అమలు చేస్తున్నట్లు ప్రకటించడం అవాస్తవమని, నవరత్నాలను అంగన్వాడీలకూ అమలు చెయ్యాలని తాము అనేకసార్లు కోరామని తెలిపారు. సమ్మె విరమించకుంటే డిస్‌మిస్ చేస్తామని హెచ్చరికలు చేయడం సరికాదన్నారు.